విలువలతో కూడిన వార్తలు రాయాలి.. అప్పుడే జర్నలిస్టులపై గౌరవం: శ్రీనివాసరెడ్డి

విలువలతో కూడిన వార్తలు రాయాలి.. అప్పుడే జర్నలిస్టులపై గౌరవం: శ్రీనివాసరెడ్డి

హనుమకొండ, వెలుగు: జర్నలిస్టులు సామాజిక బాధ్యత, విలువలతో కూడిన వార్తలు రాయాల ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. వరంగల్ లోని తాళ్ల పద్మావతి స్కూల్ లో జిల్లా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నైతిక విలువలు, పారదర్శకత కలిగిన వార్తలు రాసినప్పుడే జర్నలిస్టులపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగంలో వార్తల సేకరణ సులభమవుతుందని, భవిష్యత్ లో పత్రికల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానపాత్ర పోషించనుందన్నారు. 

రాబోయే రోజుల్లో టెక్నాలజీ, ఫ్యాక్ట్ చెక్ వంటి టెక్నికల్ అంశాలపైనా జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామన్నారు. జర్నలిస్టులు వార్తలు రాసేటప్పడు ప్రజల వాడుక భాషకు ప్రాధాన్యమివ్వాలని సీనియర్ జర్నలిస్ట్, 'వెలుగు' పత్రిక బ్యూరో, నెట్ వర్క్ ఇన్ చార్జ్ చిల్లా మల్లేశం సూచించారు. జనాలకు అర్థమయ్యే భాషలోనే సింపుల్ గా వార్తలు ఉండాలని పేర్కొన్నారు. వార్తల్లో అక్షర దోషాలపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలో సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి వివరించారు.  

తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్ మీడియా, ధోరణులు ఆధునిక యుగంలో మీడియాలో మార్పులపై సీనియర్ జర్నలిస్టు ఎడిటర్ కె.శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మేనేజర్ శైలేశ్ రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అధ్యక్షుడు  రాంచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గా ప్రసాద్, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల డైరెక్టర్ డా.వరుణ్, డీపీఆర్వో ఆయూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.