
న్యూఢిల్లీ: ఇండియా వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య చర్చలను వేగవంతం చేసింది. ఈయూతో ఈ ఏడాది చివరిలోపు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, పెరూతో కూడా చర్చలు జరుపుతోంది. చిలీతో రెండో రౌండ్ చర్చలు అక్టోబర్ 27న సాంటియాగోలో ప్రారంభమవుతాయి. పెరూతో ఎనిమిదో రౌండ్ నవంబర్ 3న లిమాలో ప్రారంభమవుతుంది. రెండు ఒప్పందాలపై చర్చలు వేరు వేరుగా జరుగుతాయి.
భారత్–చిలీ మధ్య 2006లో అమలైన ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ)ను విస్తరించేందుకు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (సీఈపీఏ) చర్చలు జరుగుతున్నాయి. సీఈపీఏలో డిజిటల్ సేవలు, ఎంఎస్‌ఎంఈలు, పెట్టుబడి ప్రోత్సాహం, కీలక ఖనిజాలు వంటి అంశాలు ఉంటాయి. 2024–25లో చిలీకి భారత్ ఎగుమతులు ఏడాది లెక్కన 2.46శాతం తగ్గి 1.15 బిలియన్ డాలర్లకి చేరాయి.
దిగుమతులు మాత్రం 72శాతం పెరిగి 2.60 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ఇండియా ప్రధానంగా ఆటో, ఫార్మా ప్రొడక్ట్‌లను ఎగుమతి చేస్తుండగా, ఖనిజాలు (1.58 బిలియన్ డాలర్లు), కాపర్, కెమికల్స్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఇండియాకు లాటిన్ అమెరికన్ కంట్రీస్ (ఎల్‌ఏసీ) లో చిలీ ఐదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
భారత్–పెరూ మధ్య పెరిగిన వాణిజ్యం..
భారత్–పెరూ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. 2024–25లో ఈ దేశానికి ఎగుమతులు 9శాతం పెరిగి 1 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 60శాతం పెరిగి 4.98 బిలియన్ డాలర్లను టచ్ చేశాయి. మోటార్‌సైకిళ్లు, ఫార్మా, స్టీల్, ప్లాస్టిక్, ఆయిల్ అండ్ గ్యాస్ పైపులు వంటి వాటిని ఇండియా ఎక్కువగా ఎగుమతి చేస్తుండగా, బంగారం, కాపర్, ద్రాక్ష, ఫిష్ ఫ్లోర్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.
భారత్–ఈయూ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎఫ్‌టీఏ చర్చలు అక్టోబర్ 6న బ్రస్సెల్స్‌లో ప్రారంభమవుతాయి. ఇది 14వ రౌండ్. డిసెంబర్‌లో ఒప్పందం పూర్తయ్యేలా లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. ఆటోమొబైల్, వైద్య పరికరాలు, మాంసం, మద్యం వంటి ఉత్పత్తులపై ట్యాక్స్ తగ్గించాలని ఇండియాను ఈయూ కోరుతోంది. 2024–25లో భారత్–ఈయూ మధ్య గూడ్స్ ట్రేడ్ 136.53 బిలియన్ డాలర్లకు (ఎగుమతులు 75.85 బిలియన్ డాలర్లు, దిగుమతులు 60.68 బిలియన్ డాలర్లు) చేరింది. ఈయూ, భారత్‌కి అతిపెద్ద వస్తువుల వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023 లో 51.45 బిలియన్ డాలర్ల విలువైన సర్వీసెస్ ట్రేడ్ జరిగింది.