భర్త కొట్టడానికి ఏడు కారణాలు చెప్తున్న భార్యలు: NFHS రిపోర్ట్

భర్త కొట్టడానికి ఏడు కారణాలు చెప్తున్న భార్యలు: NFHS రిపోర్ట్

న్యూఢిల్లీ: భర్త కొడితే భార్యలు ఊర్కోరు. కొంతమంది గృహ హింస కేసులు కూడా పెడ్తరు. కానీ కొంతమంది మహిళలు.. భర్త కొడితే తప్పేముంది? అంటున్నారు. భార్యను భర్త కొట్టడాన్ని సమర్థిస్తరా? అని అడిగిన ప్రశ్నకు చాలామంది సమర్థిస్తామని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో ఈ విషయం వెల్లడైంది. భార్యను భర్త కొట్టడం సబబేనని తెలంగాణలో అత్యధికంగా 83.8 శాతం మంది మహిళలు చెప్పారు. ఏపీలో 83.6 శాతం, కర్నాటకలో 76.9 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 14.8 శాతం, నాగాలాండ్ లో 23.9 శాతం, త్రిపురలో 29.5 శాతం మంది కరెక్టేనని తెలిపారు. మగవాళ్ల విషయానికి వస్తే తెలంగాణలో 70.4 శాతం మంది, ఏపీలో 66.5, కర్నాటకలో 81.9, హిమాచల్ ప్రదేశ్ లో 14.2, నాగాలాండ్ లో 34.4, త్రిపురలో 21.3 శాతం మంది.. భార్యలను భర్తలు కొట్టడం కరెక్టే అన్నారు. తెలంగాణ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, బిహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో ఈ సర్వే చేశారు. కాగా, 2015–16 సర్వేలో దేశవ్యాప్తంగా 52 శాతం మంది మహిళలు... భార్యలను భర్తలు కొట్టడం కరెక్టేనని చెప్పారు.

భర్త కొట్టడానికి 7 కారణాలు..

భార్యను భర్త కొట్టడానికి గల కారణాలను కూడా సర్వే వెల్లడించింది. ఎక్కువమంది మహిళలు 7 కారణాలను చెప్పారని పేర్కొంది. అవేంటంటే.. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం.. పిల్లలను, ఇంటిని పట్టించుకోకపోవడం.. భర్తతో వాదించడం.. సెక్స్ కు ఒప్పుకోకపోవడం.. వంట సరిగ్గా చేయకపోవడం.. భార్య ప్రవర్తన సరిగాలేదని అనుమానించడం.. భర్త తరఫు బంధువులను సరిగా చూసుకోకపోవడం. కాగా, భర్త తరఫు బంధువులను సరిగా చూసుకోకపోవడం.. పిల్లలను,  ఇంటిని పట్టించుకోకపోవడంతో భర్తలు కొట్టారని ఎక్కువ మంది మహిళలు చెప్పారు.