- రాష్ట్రంలో 82% ఫ్యామిలీలకు ఆరోగ్య బీమా
- 26 శాతం నుంచి 65 శాతానికి చేరిన మహిళల నెట్ వినియోగం
- ఐదేండ్లలోనే మహిళల ఇంటర్నెట్ వాడకంలో విప్లవాత్మక మార్పులు
- మగవాళ్లలో 50 శాతం నుంచి 87.3 శాతానికి ఇంటర్నెట్ వాడకం పెరుగుదల
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలోని మహిళలు వంటింటికే పరిమితం కాకుండా.. లోకాన్ని మునివేళ్లపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-–6 (2023-–24) నివేదిక రాష్ట్రంలో వివిధ రంగాలలో వస్తున్న మార్పులను వెల్లడించింది.
గత సర్వే 2019–2021 (ఎన్ఎఫ్హెచ్ఎస్– 5) సమయంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్న మహిళలు కేవలం 26.5 శాతమే ఉండగా.. తాజా నివేదిక ప్రకారం ఆ సంఖ్య ఏకంగా 64.8 శాతానికి చేరింది.
అంటే, కేవలం ఐదేండ్లలో దాదాపు రెండున్నర రెట్లు వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో పురుషుల ఇంటర్నెట్ వినియోగం కూడా 50 శాతం నుంచి 87.3 శాతానికి ఎగబాకింది. కేవలం ఇంటర్నెట్ వాడడమే కాదు, ఆర్థిక నిర్ణయాల్లోనూ మహిళలు కీలకంగా మారుతున్నారు. రాష్ట్రంలోని 92.3 శాతం మంది మహిళలకు వారు స్వయంగా ఉపయోగించుకునే బ్యాంక్ ఖాతాలు ఉండటం విశేషం. గృహ సంబంధిత నిర్ణయాల్లో 89.9 శాతం మంది మహిళలు భాగస్వాములు అవుతుండటం సామాజిక చైతన్యానికి నిదర్శనం. దాదాపు 65.8 శాతం మంది మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్లు వాడుతూ ప్రపంచంతో పోటీపడుతున్నారు.
- ప్రైవేట్ లోనే ఎక్కువ ‘కడుపు కోతలు’..
సామాజిక అంశాల్లో రాష్ట్రం మెరుగుపడుతోంది. బాల్య వివాహాల శాతం 23.5 నుంచి 17.9కి తగ్గగా, శిశువుల ఆరోగ్య విషయంలోనూ పురోగతి కనిపిస్తోంది. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. 12 నుంచి 23 నెలల వయసున్న పిల్లల్లో 80.9 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు అందుతున్నాయి. అయితే, పురుషుల జీవనశైలి అలవాట్లు మాత్రం ముప్పుగా మారుతున్నాయి. రాష్ట్రంలో 15 ఏండ్లు పైబడిన వారిలో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.
అయితే, గత సర్వేలో కూడా 43.4 శాతం నమోదయింది. అలాగే, 21.1 శాతం మందికి పొగాకు అలవాటు ఉంది. వీటి ప్రభావం వల్ల పురుషుల్లో 28.2 శాతం మందికి బీపీ, 21.4 శాతం మందికి షుగర్ సమస్యలు వచ్చాయి. స్థూలకాయం కూడా పెరిగిపోయి మహిళల్లో 36.3 శాతం మంది ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా తెలంగాణ డిజిటల్ గా దూసుకుపోతున్నా.. ఆరోగ్య అలవాట్ల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలని సర్వే గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
- 82 శాతం కుటుంబాలకు ఆరోగ్య భద్రత..
రాష్ట్రంలోని 82.2 శాతం కుటుంబాలకు ఏదో ఒక ఆరోగ్య బీమా, ఫైనాన్సింగ్ స్కీమ్ వర్తిస్తోంది. గతంలో ఇది 69.2 శాతంగానే ఉండేది. ప్రభుత్వ పథకాల వల్ల ప్రసవాల విషయంలో రాష్ట్రం వంద శాతం లక్ష్యానికి చేరువలో ఉంది. ప్రస్తుతం 98.8 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి.
అయితే, సిజేరియన్ల వ్యవహారం మాత్రం రాష్ట్రంలో దారుణంగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం ప్రసవాల్లో 62.2 శాతం ఆపరేషన్లే కావడం గమనార్హం. అందులోనూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడ జరుగుతున్న ప్రతి 100 ప్రసవాల్లో దాదాపు 84 (83.9%) సిజేరియన్లే ఉంటున్నాయి. నార్మల్ డెలివరీ అనేది అక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్ల శాతం 48.1గా నమోదైంది.
