వీధి వ్యాపారులను వేధించొద్దు : NHRC

వీధి వ్యాపారులను వేధించొద్దు : NHRC
  •     ‘వోకల్​ ఫర్ లోకల్’ ప్రోత్సహించాలి
  •     రాష్ట్రాలకు ఎన్​హెచ్ఆర్సీ ఆదేశం

న్యూఢిల్లీ: వీధి వ్యాపారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్​హెచ్ఆర్సీ) బిగ్​ రిలీఫ్​ ఇచ్చింది. పండుగ సీజన్​లో స్థానిక వ్యాపారులను అనవసరంగా తొలగించవద్దని స్పష్టం చేసింది. నవరాత్రులు, దీపావళి, ఛట్ పూజ ఫెస్టివల్​ టైంలో లోకల్ వెండర్స్, వీధి వ్యాపారులు, హాకర్లు, కుమ్మరులు, చిరు వ్యాపారుల జీవనోపాధిని, మానవ హక్కులను కాపాడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. వివిధ నగరాల్లో స్థానిక వ్యాపారులు, హాకర్లను అనవసరంగా తొలగించడం, వారి వస్తువులను స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు విధించడం, వేధింపులపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. దీనిపై గతేడాది ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్​హెచ్​ఆర్సీ ధర్మాసనం.. ఈ ఆరోపణలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాలు, స్థానిక అధికారులను ఆదేశించింది. పండుగ సీజన్లో స్థానిక వ్యాపారుల జీవనోపాధి, మానవ హక్కుల పరిరక్షణకు కమిషన్ జోక్యం మళ్లీ అవసరమని గుర్తించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

నవరాత్రి, దీపావళి, ఛట్ పూజ సందర్భంగా స్థానిక వ్యాపారులను అనవసరంగా ఖాళీ చేయించరాదని, వారి జీవనోపాధిని దెబ్బతీయకూడదని ఆదేశించింది. ‘ఫైర్/పబ్లిక్​సేఫ్టీ దృష్ట్యా ఏదైనా ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం అనివార్యమైతే, వారికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యాపారుల వస్తువులను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవద్దు. వేధింపులు, బలవంతపు వసూళ్లు వంటి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో స్థానిక వ్యాపారులు, సంప్రదాయ వృత్తులు, స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించాలి’ అని సూచించింది. ఈ ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, పోలీసులు కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్​లపైనే ఉంటుందని పేర్కొంది. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అంశాలపై తదుపరి చర్య నివేదికను ఈ నెల 18 నాటికి సమర్పించాలని స్పష్టం చేసింది.