పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న నోటిఫైడ్ వెండింగ్ జోన్లో 60 నుంచి 70 మంది లైసెన్స్ కలిగిన వీధి వ్యాపారులను జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా తొలగించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు అందింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. స్ట్రీట్ వెండర్స్ చట్టం-2014 ప్రకారం వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాల్సి ఉన్నప్పటికీ, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ జీవనోపాధిని దెబ్బతీశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నగరవ్యాప్తంగా ‘స్పెషల్ డ్రైవ్’ పేరుతో వేలాది వెండింగ్ యూనిట్లను తొలగించడం ఉపాధి హక్కును హరించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డెయిరీ నంబర్ 7402/IN/2026 కింద నమోదైన ఈ కేసుపై కమిషన్ త్వరలోనే పూర్తిస్థాయి విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది ఇమ్మనేని తెలిపారు.
