- విశాఖపట్నంలోని స్పెషల్ కోర్టులో దాఖలు
- విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలు
- మే నెలలో సమీర్, సిరాజ్ అరెస్ట్
- విజయనగరం పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఏ దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో విశాఖపట్నంలోని స్పెషల్ కోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ (29), హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ (28) పై అభియోగాలు మోపింది. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదంలో చేర్చడంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఉగ్ర దాడులకు వారు కుట్రపన్నారని ఎన్ఐఏ పేర్కొంది.
వీరిద్దరిని ఈ ఏడాది మే 16, 17న విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (అహిం) పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారు. ‘మ్యాజిక్ లాంతర్’ సహా వివిధ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా టెర్రరిజం వైపు యువతను ఆకర్షించేలా రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేశారు.
ఇలాంటి గ్రూపుల్లో 50 మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరికి సౌదీ అరేబియాలో ఉండే ఓ హ్యాండ్లర్ నుంచి ఆదేశాలు వచ్చేవి. పేలుడు పదార్థాలను తయారు చేయడంపై ఆ హ్యాండ్లర్ సూచనలు ఇచ్చేవాడు. దీంతో సిరాజ్, సమీర్ బ్లాస్టింగ్స్ ఎక్స్‌పరిమెంట్స్ చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేశారు. విజయనగరం, హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్నాడు.
ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్
సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ కదలికలపై తెలంగాణ సీఐ సెల్ అధికారులకు అందిన సమాచారంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిరాజ్‌ను విజయనగరంలో అరెస్టు చేశారు. పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. సమీర్‌ను హైదరాబాద్ బోయగూడలో అరెస్టు చేసి విజయనగరం తరలించారు. ఈ కేసులో ఎన్‌ఐఏ సమగ్ర దర్యాప్తు జరిపింది. సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్‌ల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. వీరిద్దరు ఐసిస్ భావజాలంతో వివిధ సోషల్ మీడియా గ్రూపులు, చానళ్ల ద్వారా రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. ఇన్‌స్టాగ్రాం, సిగ్నల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అనేక సోషల్ మీడియా గ్రూపులను సృష్టించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ ఆదేశాల మేరకు సిరాజ్, సమీర్ పనిచేసినట్లు ఎన్‌ఐఏ తన చార్జీషీటులో వెల్లడించింది.
