- ఆపరేషన్ కగార్, మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఏంటి ?
- రంగారావును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ
ఖమ్మం టౌన్, వెలుగు : ‘గాదె ఇన్నయ్య, మీరు వాట్సాప్ చాటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారు ? ఇన్నయ్య, తాతా రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చంద్రమౌళి మీకు ఎలా తెలుసు’ అని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్‌ఐఏ ప్రశ్నించింది. బుధవారం ఖమ్మం వచ్చిన ఎన్‌ఐఏ ఆఫీసర్లు పట్టణంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు గంటల పాటు రంగారావును విచారించారు. విచారణ అనంతరం రంగారావు మీడియాతో మాట్లాడారు. తన పుట్టు పూర్వోత్తరాల నుంచి మొదలుకొని విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం, కుటుంబ, ఉద్యమ నేపథ్యం వంటి విషయాలపై ఆఫీసర్లు ప్రశ్నించినట్లు తెలిపారు.
ఆపరేషన్ కగార్, మావోయిస్టు పార్టీలతో తనకున్న సంబంధమేమిటి ? చంద్రమౌళితో పరిచయం ఉందా ? అని అడిగారని తెలిపారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మ చనిపోతే, తన తల్లి అక్కడకు వెళ్లిన వీడియోను ఎందుకు షేర్ చేశారని ప్రశ్నించారన్నారు. మావోయిస్ట్ భావజాలాన్ని ప్రభావితం చేసే వీడియోలను ఫార్వార్డ్ చేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఫార్వార్డ్ చేశానే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని సమాధానమిచ్చానన్నారు.

