మావోయిస్టులపై ఎన్ఐఏ రివార్డు

మావోయిస్టులపై ఎన్ఐఏ రివార్డు
  • మావోయిస్టులపై ఎన్ఐఏ రివార్డు
  • నంబాల కేశవరావును పట్టిస్తే రూ.50 లక్షలు
  • మిలటరీ చీఫ్​ హిడ్మాకు రూ.25 లక్షలు

భద్రాచలం, వెలుగు : నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్ఐఏ) దండకారణ్యంలోని మావోయిస్టుల తలలపై రివార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 2013 మే 25న జరిగిన జీరంఘాట్​ఘటనతో పాటు మావోయిస్టుల విధ్వంసాలపై ఇన్వెస్టిగేషన్ ​చేస్తున్న ఎన్ఐఏ 21 మంది మోస్ట్​ వాంటెడ్ ​మావోయిస్టుల జాబితా ప్రకటించింది. అందులోని వారిని గుర్తించి సమాచారం ఇచ్చిన వారికి లక్షల్లో రివార్డు ఇవ్వడంతో పాటు, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది.

మావోయిస్టు పార్టీ చీఫ్​ నంబాల కేశవరావు అలియాస్​ బస్వరాజ్​అలియాస్​ గంగన్నను పట్టిస్తే రూ.50 లక్షలు, మిలటరీ చీఫ్​ హిడ్మా పై రూ.25 లక్షలు, తిప్పరి తిరుపతి, గణేశ్​లపై రూ.7 లక్షల చొప్పున, భగత్​ హేమ్ల అలియాస్ భద్రు, బార్సే సుక్కా అలియాస్​ దేవా, మండవి జయలాల్​ అలియాస్ గంగా, సోమా సోడి అలియాస్ సురేందర్​లపై రూ.5లక్షల చొప్పున, తెల్లం అయితూ, కుర్సం సన్నీ అలియాస్ ​కోశి, భద్రూ మోడియం అలియాస్​ కిషన్​లపై రూ.2.50 లక్షల చొప్పున, మోడియం రమేశ్ అలియాస్ ​ లచ్చు, సరిత కేకా, సోమా, కుమ్మ గొందె అలియాస్ ప్రదీప్,​ కవ్వాసి కామేశ్​, కోర్సా సన్నీ, సన్నీ హేమ్లా, కొర్సా లక్కు అలియాస్​ మంగ్లీలపై రూ.లక్ష చొప్పున, సన్ను వెట్టి, మడకాంలపై రూ.50వేల చొప్పున ప్రకటించింది.

సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రఖర్మతో పాటు 32 మందిని మావోయిస్టులు జీరంఘాట్​లో చంపేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో  రివార్డులిస్తామని ప్రకటన విడుదల చేసింది.