- ఓ ఇంటిలో నాలుగు గంటల పాటు సాగిన తనిఖీలు
- వైజాగ్‌లో దొరికిన ఉగ్ర లింకులున్న వ్యక్తి ఫాలోవర్స్‌పై నిఘా
- ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టులపై ఆరా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. చైన్నై నుంచి రెండు వెహికల్స్‌లో సోమవారం రాత్రి ఎన్ఐఏ టీమ్ కొత్తగూడెం చేరుకుంది. ఏఆర్ పోలీసుల సహకారంతో మంగళవారం తెల్లవారుజామున నగరంలోని మధురబస్తీలో తనిఖీలు చేసింది. నగరంలోని సూపర్‌బజార్, బస్టాండ్ సెంటర్లలో పాన్, టీ షాపులు నిర్వహిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి నాలుగు గంటల పాటు సోదాలు చేశారు.
ఒకే ఆవరణలో ఉంటున్న ముగ్గురు అన్నదమ్ముల ఇండ్లలో క్షుణ్ణంగా సోదా చేశారు. ఇటీవల ఏపీలోని వైజాగ్ ప్రాంతంలో టెర్రరిస్టులతో సంబంధాలున్న ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి జిహాద్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడితో సంబంధాలున్న వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టింది.
ఆ ఫ్యామిలీలోని ఇంటర్ స్టూడెంట్ వైజాగ్‌లో పట్టుబడిన వ్యక్తి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవుతున్నట్లు, పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ల్యాప్‌టాప్ తో పాటు అందరి ఫోన్లను పరిశీలించారు. తన తమ్ముడి కొడుకు ఏం పోస్టులు పెట్టాడో తమకు తెలియదని, ఎందుకు సోదాలు చేస్తున్నారో అర్థం కాలేదని ఇంటి యజమాని ఆజం వాపోయాడు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆఫీసర్లు సూచించారని తెలిపాడు. కొత్తగూడెంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
