వేరే వంద సినిమాలకు బదులు.. పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా చాలు: నిధి అగర్వాల్

వేరే వంద సినిమాలకు బదులు.. పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా చాలు: నిధి అగర్వాల్

‘హరిహర వీరమల్లు’సినిమాలో నటించడం తన  అదృష్టం అని చెప్పింది నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పిన విశేషాలు. 

‘‘ఇదొక పీరియాడిక్ డ్రామా. పంచమి అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తా.  నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది.

నా క్యారెక్టర్ కోసం వాడిన జ్యువెలరీ అంతా ఒరిజినలే. మేకోవర్ కోసం రెండున్నర గంటల సమయం పట్టేది. భరతనాట్యం నేపథ్యంలో ఉండే ఓ  సన్నివేశం ఛాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.

వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. ఆయన  నుంచి ఎంతో నేర్చుకున్నా.  మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు.

పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్‌‌‌‌లాగా ఉంటుంది. ముందుగా క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు.

ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు టెక్నికల్‌‌‌‌గా గొప్పగా ఆలోచిస్తారు. ఈ తరానికి తగ్గట్టుగా ఆయన పని చేస్తారు. కీరవాణి గారి సంగీతం సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తుంది. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. ఆయనకి హ్యాట్సాఫ్. ఇక ఈ చిత్రం ప్రేక్షకులకు ఐఫీస్ట్‌‌‌‌లా ఉంటుందని భావిస్తున్నా’’.