నైజీరియాలో వరద బీభత్సం.. 600 మందికి పైగా మృతి

నైజీరియాలో వరద బీభత్సం.. 600 మందికి పైగా మృతి

ఆఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి వరదలు ఎన్నడూ రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. అధికారులు ముందే అలెర్ట్ చేసినా.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడలేదని.. అందుకే భారీ ప్రాణనష్టం జరిగిందని నైజీరియా అధికారులు తెలిపారు. ఈ భారీ విపత్తులో దాదాపు 2 లక్షల ఇండ్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. 

ఆహార ఉత్పత్తి పై వరదల ప్రభావం దేశానికి నిజమైన ముప్పుగా మారనుంది. తీవ్ర ఆహార సంక్షోభానికి ఇది దారి తీయనుంది. నైజీరియాలోని కేర్ ఇంటర్నేషనల్ నేతృత్వంలో వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు. కేర్ ప్రభావిత కమ్యూనిటీలలో పరిశుభ్రత పై అధికారులు దృష్టి సారించారు. నీటి ద్వారా కలరా వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేశారు.