ఎకో పార్కుల వద్ద నైట్ స్టే ఫెసిలిటీ.. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

ఎకో పార్కుల వద్ద నైట్ స్టే ఫెసిలిటీ..  ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
  •     మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.1.44 కోట్లతో నిర్మించిన జిల్లా అటవీశాఖ నూతన కార్యాలయ భవనాన్ని సోమవారం హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో రెండు ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అక్కడ ‘నైట్ స్టే’ సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. అడవుల సంరక్షణ కోసం రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 త్వరలో నారాయణఖేడ్, జహీరాబాద్‌‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరతోష్ పంకజ్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌‌పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.