Ghatikachalam Review: మారుతి ‘ఘటికాచలం’ రివ్యూ.. మెడికో హర్రర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Ghatikachalam Review: మారుతి ‘ఘటికాచలం’ రివ్యూ.. మెడికో హర్రర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

నిఖిల్ దేవాదుల, ఆర్వికా గుప్తా జంటగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథను అందిస్తూ నిర్మించారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌‌‌‌‌‌‌‌కేఎన్ ఈ సినిమాను నేడు (మే31న) థియేటర్స్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేశారు.

మెడికో హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్‌లో జరిగిన పరిణామాలు ఏంటీ? టీజర్, ట్రైలర్ తో భయపెట్టిన ‘ఘటికాచలం’.. రిలీజయ్యాక ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది? అనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

కౌశిక్ (నిఖిల్ దేవాదుల) మెడిసన్‌ స్టూడెంట్‌. అతనో ఇంట్రోవర్ట్‌. ఎలాంటి ఫీలింగ్స్ ను బయట చెప్పుకోలేడు. అంతేకాకుండా పిరికివాడు, భయస్తుడు కూడా. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న కౌశిక్ తో ఎవరూ కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. దానికితోడు అతన్ని బాగా ఎగతాళి చేస్తారు.

ఇలాంటి లక్షణాలున్న కౌశిక్ జీవితంలోకి తన క్లాస్ మెట్ సంయుక్త వస్తుంది. తనకే తెలియకుండా సంయుక్తని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు కౌశిక్. కానీ, సంయుక్త మాత్రం వేరే అబ్బాయితో డీప్ లవ్లో ఉంటుంది. అది తెలిసి కౌశిక్ ఒంటరిగా మిగిలిపోతాడు.

తన జ్ఞాపకాలను తలుచుకుంటూ మానసిక సంఘర్షణకు లోనవుతాడు. అయితే, రాను రాను అతనిలో ఓ విధమైన మార్పు వస్తుంది. అతన్ని ఓ శక్తి వెంటాడుతున్నట్టుగా ప్రతిక్షణం అనుకుంటాడు. దానికి తోడు బయట నుంచి శబ్దాలు వినిపిస్తున్న ఫీలింగ్ కూడా మొదలవుతుంది. ఈ క్రమంలోనే అతన్నో దెయ్యం ఆవహించిన మాదిరిగా మార్పులు వస్తుంటాయి.

అయితే, కౌశిక్కు ఉన్నది సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌ హా ? లేదా అతను ఇలా మారడానికి బాబాలు, మంత్రగాళ్ళు చేసిన పనా? అసలు ఇందులో కుందనబాగ్‌ ఘటికాచలం ఎవరు? కౌశిక్‌కి అతనికి సంబంధం ఏంటీ? కౌశిక్ ఇలా మారిపోవడానికి అసలైన కారణాలేంటి? అనేది మిగతా కథ. 

మూవీ ఎలా ఉందంటే:

తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్, హార్రర్ సినిమాలంటే మక్కువ ఎక్కువ. మెడికల్ కాన్సెప్ట్స్ తో వచ్చిన సినిమాలకు సైతం మన ఆడియన్స్ పట్టంకట్టారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు కథకు కొంచెం ట్విస్టులు జోడించిన కూడా ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళతారు. అలాంటి థ్రిల్లింగ్ టేస్ట్ మన తెలుగు ఆడియన్స్ ది. ఇప్పుడు మెడికో హార్రర్ జోనర్ లో వచ్చిన ఘటికాచలం.. ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఇవ్వడంతో పాటు ప్రస్తుత సమాజంలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్ ఇచ్చారు.

నేటి బిజీ ప్రపంచంలో పిల్లలకు, పేరెంట్స్ కు మధ్య పెరిగిన దూరాన్ని చూపెట్టారు. పేరెంట్స్ తమ తమ ఉద్యోగాలలో బిజీగా ఉంటూ, చిన్నప్పటి నుంచే పిల్లలను కేరింగ్ సెంటర్స్ లోనూ, కేర్ టేకర్స్ ఒళ్ళోనూ పెట్టి పనులు చేసుకుంటున్నారు. ఇంకొంచెం పిల్లలు పెద్దగయ్యాక స్కూల్స్, ట్యూషన్ల పేరుతో వయస్సుని మించిని యుద్ధ వాతావరణాన్ని అందిస్తున్నారు.

అందువల్ల చిన్నప్పుడే పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. దాంతో మానసిక రంగంలోని డాక్టర్స్ సమాజంలో పెరిగిపోతూ వస్తున్నారు. అయితే, డాక్టర్స్ పెరిగితే నష్టం లేదు. కానీ, వారి దగ్గర ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసే యువకులు పెరుగుతున్నారు. ఇటువంటి సైకలాజికల్ అంశాలకు హార్రర్ పాయింట్స్ జోడించి ఘటికాచలం రూపొందించారు.

కథ విశ్లేషణకి వస్తే.. ఫస్టాఫ్ లోనే హీరో క్యారెక్టర్ కి సంబంధించిన అంశాలు చూపించారు. ఆ తర్వాత తన జీవితంలోకి ఓ అమ్మాయి రావడం, ఆ అమ్మాయి వేరే అతన్ని ప్రేమించడం, మానసిక సమస్యకు లోనవ్వడం వంటివి ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ లో ఒక ఆత్మ కౌశిక్ ని ఆవహించే సీన్స్ తో ఉత్కంఠకు గురిచేసి సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు.

ఆ తర్వాత దెయ్యం ఎంట్రీ ఇవ్వడం, ప్రతి 5 నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటూనే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెంచాడు. అయితే, ఘటికాచలం కౌశిక్ ని ఆవహించడం వెనుక ఉన్న లాజిక్..ఇంకా బలంగా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. 

ఎవరెలా నటించారంటే?

చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాలకుపైగా నటించిన నిఖిల్ దేవాదులకి హీరోగా ఫస్ట్ మూవీ ఇది. పాజిటివ్‌తో పాటు నెగటివ్ షేడ్స్‌లోనూ చక్కగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే తన విభిన్నమైన నటనను కనబరిచాడు. పాత్ర ఒక్కటే అయినప్పటికీ.. కానీ అందులోనే రెండు మూడు వేరియేషన్స్‌ తో బలమైన పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా సంయుక్త రెడ్డి, హీరో తండ్రిగా ప్రభాకర్‌, తల్లిగా దుర్గాదేవి, డాక్టర్‌గా ఆర్వికా గుప్తా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక అంశాలు:

మ్యూజిక్ డైరెక్టర్ ప్లేవియో కుకురోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. BGM తో అదరగొట్టాడు. ఎస్.ఎస్. మనోజ్ కెమెరా వర్క్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు అమర్ కామేపల్లి కథ స్క్రీన్ ప్లే కోసం పడిన కష్టం కనిపిస్తుంది. థ్రిల్లింగ్ గా, సందేశాత్మకంగా తీర్చిదిద్దిన విధానం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా సినిమాను ఉన్నతంగా నిలిచేలా చేశాయి.