నా ఓటు హక్కు కోసం హైకోర్టుకైనా వెళ్తా

నా ఓటు హక్కు  కోసం హైకోర్టుకైనా  వెళ్తా

తన ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇవాళ్టితో(మార్చి31) తన పదవి కాలం ముగుస్తుండటంతో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో దరఖాస్తు చేసుకున్నానని.. అది నిరాకరించడంవల్ల.. టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు. ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల కమిషన్  ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.  ఏపీలో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, సీఎస్ నుంచి పూర్తి సహకారం లభించిందని, మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు.