
- కియోస్క్ మెషిన్లతో రోగులే స్వయంగా ఓపీ తీసుకోవచ్చు
- సొంతంగా బీపీ చెక్ చేసుకునేందుకు బీటీఎమ్
- టెక్నాలజీ సహాయంతో రోగులకు ఈజీగా, ఫాస్ట్‌గా ట్రీట్మెంట్
- త్వరలో మరిన్ని విభాగాలకు ఈ తరహా సేవలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రోగులకు సత్వర సేవల కోసం టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆసుత్రికి వచ్చే పేషెంట్లు.. ఓపీ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి లేకుండా స్వయంగా ఓపీ తీసుకునేలా కియోస్క్ పేరుతో రెండు మెషిన్లను ఏర్పాటు చేశారు. అది సత్ఫలితాలను ఇస్తుండడంతో ఈ సేవలను మరిన్ని విభాగాలకు విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు.
ఇటీవల పేషంట్లే స్వయంగా బీపీ, పల్స్ చెక్ చేసుకునేందుకు ఓ స్వచ్ఛందం సంస్థ సాయంతో.. బీపీ టెల్లింగ్ మెషిన్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిమ్స్ఆసుపత్రిలో వైద్య సేవలు ఈజీ, ఫాస్ట్ అవుతున్నాయి. ఈ మెషిన్ల ద్వారా.. పేషంట్లు క్యూలైన్లలో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం తప్పుతున్నది.
కియోస్క్‌తో నిమిషంలో ఓపీ
నిమ్స్ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. ఉదయం 5 గంటల నుంచే ఓపీ క్యూలైన్లు నిండిపోయి ఉంటాయి. ఓపీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. దీనికి చెక్ పెట్టేందుకు రెండు నెలల క్రితం.. నిమ్స్ ఆసుపత్రిలో కియోస్క్ మెషిన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రెండో సారి ఫాలోఅప్ కోసం, రివ్యూ కోసం వచ్చేవారు, రిపోర్టులు డాక్టర్లకు చూపించడానికి వచ్చే రోగులు కియోస్క్ మెషిన్లలో గతంలో చూయించుకున్న ఓపీ సీఆర్ నంబర్ ఎంటర్ చేసి 30 సెకండ్ల నుంచి 1 నిమిషంలోపే మళ్లీ ఓపీని పొందొచ్చు.
రోజు నిమ్స్ కు వచ్చే రోగుల్లో దాదాపు 60 శాతం మంది రీవిజిట్ కోసం వచ్చినవారే ఉంటారు. సాధారణ రోగులకు 14 రోజులు, ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ కేటగిరీ రోగులకు 28 రోజుల వరకు ఈ అవకాశం ఉంటుంది. మొదటిసారి ఓపీ కోసం వచ్చే రోగులు మాత్రం కౌంటర్లలో ఓపీ తీసుకోవాల్సి టుంది. ప్రస్తుతం ఈ కియోస్క్ మెషిన్లు ఓల్డ్ బిల్డింగ్ ఓపీ వద్ద, మిలీనియం బ్లాక్ ఓపీ వద్ద ఏర్పాటు చేశారు. ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, డెర్మటాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ, రుమటాలజీ తదితర విభాగాలకు చెందిన రోగులు కియోస్కి సేవలను వినియోగించుకుంటున్నారు. త్వరలో అన్ని విభాగాలకు కియోస్క్ సేవలను విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బీపీ చెకింగ్ కోసం... బీటీఎం
నిమ్స్ కు వచ్చే రోగులకు బీపీ చెకింగ్ కూడా సులభతరం చేసింది నిమ్స్. వేం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో.. రెండు చోట్ల బీపీ టెల్లింగ్ మెషిన్ల(బీటీఎమ్)ను ఇటీవలే ఏర్పాటు చేసింది. ఆస్కిలోమెట్రిక్ టెక్నాలజీతో పనిచేసే ఈ మెషిన్లు కచ్చితమైన వివరాలను ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. నిమ్స్‌లోని సెక్యూరిటీ ఆఫీస్ సమీపంలో ఒకటి, స్పెషాలిటీ బ్లాక్ ఎదురుగా మరోకటి ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా చిన్నపాటి గదిని సిద్ధం చేయించి, టెస్టింగ్ సమయంలో రోగి కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయించారు. ఈ మెషిన్లు 17-42 సెం.మీ. చుట్టుకొలత ఉన్న చేతులకు సరిపోయేలా సర్దుబాటు చేయగల కఫ్‌ను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఏ వయసువారైన, ఏ చేతి పరిమాణం కలిగిన రోగులైన సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. కఫ్ లో రోగి చేతిని ఉంచితే ఆటోమేటిక్ గా.. బీపీ, పల్స్ వివరాలు సహా తేదీ, సమయంతో ప్రింట్ అయి రిసిప్ట్ వస్తుంది. డాక్టర్ల వద్ద మళ్లీ బీపీ చెక్ చేయించుకునే అవసరం లేకుండా, ఈ రిసిప్ట్ ను చూపించొచ్చని అధికారులు చెబుతున్నారు. పేషంట్ల సౌకర్యార్థం మున్ముందు టెక్నాలజీతో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిమ్స్ అధికారులు చెబుతున్నారు.