- 56 టీవీవీపీ హాస్పిటల్స్, 9 మెడికల్ కాలేజీ డాక్టర్లకు ట్రైనింగ్
- నిమ్స్ హాస్పిటల్లో స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ట్రామా కేర్ సెంటర్లకు హైదరాబాద్ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ను స్టేట్ ట్రామా కేర్ నెట్‌వర్క్ నోడల్ సెంటర్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కాబోయే ట్రామా సెంటర్ల నిర్వహణ, డాక్టర్లకు శిక్షణ, టెక్నికల్ సపోర్ట్ అంతా నిమ్స్ పర్యవేక్షణలోనే జరగనున్నది.
ఈ మేరకు సోమవారం నిమ్స్ ఆడిటోరియంలో ట్రామా కేర్ ఫెసిలిటీపై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హాజరై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 56 తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, 9 డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చారు.
నిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో.. ఎయిర్‌వే మేనేజ్‌మెంట్, న్యూరో ట్రామా, ఆర్థోపెడిక్ ట్రామా, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కాగా, ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందేలా.. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక సెంటర్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు.
గోల్డెన్ అవర్తోనే ప్రాణాలు సేఫ్: హెల్త్ సెక్రటరీ
ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు అన్నారు. ఆ టైంలో ప్రొటొకాల్ ప్రకారం ట్రీట్‌మెంట్ అందితే బాధితుడిని బతికించుకోవచ్చని చెప్పారు. నిమ్స్ వంటి పెద్ద సంస్థల అనుభవంతో జిల్లాల్లోని ట్రామా సెంటర్లను బలోపేతం చేయాలన్నారు. కేవలం హాస్పిటల్స్ పెట్టడమే కాదని.. వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించడమే అసలైన సవాల్ అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు.
లెవల్ 2, లెవల్ 3 సెంటర్ల మధ్య స్ట్రాంగ్ రిఫరల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల పేషెంట్లను ఇక్కడి నుంచి అక్కడికి తిప్పే తిప్పలు తప్పుతాయని చెప్పారు. ట్రామా కేర్ అంటే కేవలం ఎమర్జెన్సీ వార్డు మాత్రమే కాదని.. అంబులెన్స్ సేవలు, హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ల ట్రీట్‌మెంట్, ఆ తర్వాత రీహాబిలిటేషన్.. ఇవన్నీ కలిపితేనే పూర్తి స్థాయి వ్యవస్థ అని టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
