
నిఫా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో తాజాగా ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో అసలు నిఫా వైరస్ అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటీ అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిపా వైరస్ అనేది జూనోటిక్ వైరస్. ఇది జంతువుల నుంచి మానవులకు.. కొన్ని సందర్భాల్లో వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను 1999లో గుర్తించారు. మలేషియాలోని సుంగై లో ఈ వైరస్ ను కనుక్కోవడంతో ఈ గ్రామానికి నిపా అనే పేరు పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిఫా అనేది పారామిక్సోవైరస్. ఇది జలుబుకు కారణమయ్యే కొన్ని వైరస్లలో ఒకటైన హ్యూమన్ పారాఇన్ఫ్లూయెంజా వైరస్‌కి సంబంధించినది. ఇప్పటి వరకు మానవులకు సోకిన నిఫా వైరస్ కేసులన్నీ గబ్బిలాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం వల్లనే సంభవించాయి.
సంకేతాలు, లక్షణాలు:
నిపా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉన్నాయి. ఈ లక్షణాలతో పాటు మైకం, మగత, నాడీ సంబంధిత సంకేతాలు, 24-48 గంటల్లో కోమాకు దారితీయవచ్చు.
నిపా వైరస్ వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది. అలాగే, నిపా ఇన్ఫెక్షన్ అనేది ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు). ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, నిఫా వైరస్ సంక్రమణ వల్ల అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛలు, కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీస్తుంది.