నీరవ్ మోడీ అరెస్ట్: పెరిగిన PNB బ్యాంకు షేర్లు

నీరవ్ మోడీ అరెస్ట్: పెరిగిన PNB బ్యాంకు షేర్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లో అరెస్టు చేశారు. దీంతో పీఎన్ బీ బ్యాంకు షేర్లు భారీగా పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్యాంకు షేరు 3.37 శాతం పెరిగి..రూ.93.55 వద్ద స్థిరపడింది. ఈ రోజు నీరవ్ మోడీని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు లండన్ పోలీసులు తెలిపారు.  భారత్ నుంచి పారిపోయిన 17 నెలల తర్వాత నీరవ్ మోడీ అరెస్టయ్యారు.
PNB బ్యాంకు కుంభకోణంలో నీరవ్ తో పాటు అతని బంధువు మోహుల్ ఛోక్సీ కూడా ఉన్నాడు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సుమారు 14 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ… బ్రిటన్ కు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. ఈ మధ్య లండన్ వీధుల్లో నీరవ్ తిరుగుతున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. నీరవ్ ను భారత్  తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. నీరవ్ ను తమకు అప్పగించాలని మార్చి 9న లండన్ లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్  కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది.

ఈ రోజు నీరవ్ ను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశ పెడుతున్నారు అక్కడి పోలీసులు. ఆ తరువాతే భారత్ కు నీరవ్ ను అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు నీరవ్ కు సంబంధించిన ఆస్తుల వేలానికి ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నీరవ్ కు సంబంధించిన 173 పేయింటింగ్స్ తో పాటు 11 లగ్జరీ కార్లను ఈడీ విక్రయించనుంది.