మరోసారి కోర్టులో కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

మరోసారి కోర్టులో కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు తాజాగా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు రేపటికి(గురువారం) వాయిదా వేసింది. దోషుల శిక్ష అమలుకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఇవాళ(బుధవారం)  విచారణ జరిపింది. అయితే తన తరఫున వాదించేందుకు లాయర్ ఎవరూ లేరంటూ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా కోర్టుకు తెలిపాడు. దీంతో అతడి తక్షణమే కోర్టు న్యాయ సహాయం అందించింది. ఎంపానెల్డ్‌ న్యాయవాదుల జాబితాను ఇచ్చి లాయర్‌ను ఎంచుకోవాలని సూచించింది. తర్వాత డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కోర్టు తీర్పుతో ఆవేదనకు లోనైన నిర్భయ తల్లి కోర్టులో కంట తడిపెట్టారు. తన హక్కుల సంగతేంటని ఆమె ప్రశ్నించారు. చేతులు జోడించి నిలబడ్డానని ఆమె అన్నారు. తాను కూడా సాధారణ మనిషినేనని అన్నారు. ఇప్పటికే 7 సంవత్సరాలు దాటిపోయిందని… దోషులు అనుసరిస్తున్న డిలే టాక్టిస్‌ను కోర్టు లెక్కలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాదు తాను విశ్వాసాన్ని, ఆశను కోల్పోతున్నానని తెలిపారు.

నిర్భయ దోషి పవన్‌కు ఇప్పుడు కొత్తగా లాయర్ ను ఏర్పాటు చేస్తే… ఆ లాయర్ కేసును ఫైల్ చేయడంలో మరింత ఆలస్యం చేస్తారని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు హై కోర్టు మాత్రం ప్రతీ దోషి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని తెలిపింది.