బాసర ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకున్న ఘటనలో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని హెచ్ సీయూ ప్రోఫెసర్ వీరబాబు ప్రశ్నించారు. ఐటీ విద్యా సంస్థలో అధికారులు కమిషన్ లకు కక్కుర్తి పడుతున్నట్లు, దళారీ వ్యవస్థను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. అంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సీఎం స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. ఈ ఘటనపై హెచ్ సీయూ (HCU) ప్రోఫెసర్ వీరబాబుతో V6 మాట్లాడింది.
అక్కడున్న అధికారులు కమిషన్ లకు కక్కుర్తి పడ్డారని.. విద్యార్థులకు క్వాలిటీ పుడ్ పెట్టడం లేదన్నారు. ఏవైనా ఘటనలు జరిగితే.. బయటకు తెలియనీయకుండా విద్యార్థులను భయపెడుతారని తెలిపారు. కేంద్రీయ భండారి నుంచి సరుకులు రావడం లేదని, వేరే దగ్గరి నుంచి నాసిరకం సరుకులు తెస్తున్నారని ఆరోపించారు. ఈ తతంగం అంతా కొన్ని ఏళ్లుగా జరుగుతోందన్నారు. కనీసం ఇక్కడ సౌకర్యాలు లేవని, వందల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను తెలుసుకొనేందుకు వెళ్లిన వారిని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా ? అని నిలదీశారు. రాజకీయం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని అధికారపక్షం చెప్పడం సబబు కాదన్నారు. లోపాలున్నాయి కాబట్టే.. భయంతో లోపలకు అనుమతించడం లేదని హెచ్ సీయూ ప్రోఫెసర్ వీరబాబు తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే ఫుడ్ పాయిజన్ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్థులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
