బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల పోరాటానికి దక్కిన ఫలితం

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల పోరాటానికి దక్కిన ఫలితం

నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలపై స్టూడెంట్లు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. ఆర్జీయూకేటీలో అభివృద్ధి పనుల కోసం రూ.16 కోట్లు కేటాయించినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ వెల్లడించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్​కుమార్ తో కలిసి కలెక్టర్.. మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 16 కోట్ల నిధులతో అవసరమైన అన్ని పనులు చేపడతామని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్, అకడమిక్ క్యాలెండర్ రూపొందించామని వెల్లడించారు. కొత్తగా మరో 1500 మంది స్టూడెంట్లకు సరిపడేలా మెస్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఫుడ్​ క్వాలిటీపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత ఫుడ్ కాంట్రాక్టర్​ను తొలగించి.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు1,450 ల్యాప్ ట్యాప్​లను స్టూడెంట్లకు పంపిణీ చేశామని.. మిగతావి త్వరలో అందజేస్తామని అన్నారు. అకడమిక్  క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తయ్యేలా ఫ్యాకల్టీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. క్యాంపస్ లో ప్రత్యేకంగా మహిళా ఎస్సైని నియమిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు లైబ్రరీ అందుబాటులోకి తెస్తామన్నారు. స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్త్ ఫైల్ తయారు చేస్తున్నామని చెప్పారు. క్యాంపస్​లో ఎన్సీసీని కూడా ప్రవేశ పెడతామని.. అందరికీ యూనిఫామ్ అందేలా  చర్యలు తీసుకుంటామని అన్నారు.  క్యాంపస్ లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.