- ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల హవా
- ఒక్కో బండి రిజిస్ట్రేషన్ కోసం రూ.4వేలు డిమాండ్
- స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే అధికారుల కొర్రీలు
- ఏజెంట్ల ద్వారా వెళ్తే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: షోరూమ్స్‌లో వాహనాలు కొన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విధానం అమలుకు నోచుకోవడం లేదు. సుమారు నాలుగేండ్ల కిందే అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినా.. ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. దీంతో హైదరాబాద్ నగరంలోని అన్ని జోనల్, ఖైరతాబాద్‌లోని సెంట్రల్ జోన్‌లోనూ కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏజెంట్లను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెహికల్ కొన్నప్పుడే అన్ని రకాల డాక్యుమెంట్లు ఇస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అవసరంలేని డాక్యుమెంట్లు అడుగుతూ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రవాణా చట్టంలో రహదారి భద్రత యాక్ట్‌ను తీసుకొచ్చింది. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ చట్టం చెప్తున్నది. అయినప్పటికీ కొందరు షోరూమ్ నిర్వాహకులు, అధికారులు ఏజెంట్లతోనే ఈ పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులిస్తేనే పని
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఏజెంట్ల హవానే కొనసాగుతున్నది. స్లాట్‌బుక్ చేసుకుని డైరెక్ట్ వెళ్తే సంబంధిత శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే ఏజెంట్ల ద్వారా వెళ్తే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు. ఒక్కో ఏజెంట్ వాహనదారుడి నుంచి సుమారు రూ.3వేల నుంచి రూ.4వేలు వసూలు చేస్తున్నాడు.
ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. కాగా, కొత్త వెహికల్ కొన్నప్పుడు షోరూమ్ నిర్వాహకులు లైఫ్ ట్యాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేసుకుంటారు. అలాగే, హ్యాండ్లింగ్ చార్జీలు, యాక్సెసరీస్ పేరుతో మరో రూ.15వేల వరకు దోచుకుంటున్నారు. అదనంగా మరో రూ.3వేలు చెల్లిస్తే ఒక ఏజెంట్‌ను షోరూమ్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు.
ఆఫీస్‌లో అడుగుపెట్టగానే ఎదురుపడ్తున్న ఏజెంట్లు
వెహికల్ కొన్న నెల రోజుల్లో సదరు వాహనదారుడు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్తే.. ఎంవీఐ స్థాయి అధికారి బండి ఛాసిస్ నంబర్, డాక్యుమెంట్లు చెక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ.. కొందరు అధికారులు ఏదో ఒక డాక్యుమెంట్ లేదని.. లైసెన్స్ తీసుకురాలేదని.. ఒరిజినల్స్ లేవనే సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాహనదారులు చెప్తున్నారు.
ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారికి మాత్రం నిమిషాల్లో పని పూర్తి చేసి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని ఐదు జోన్ల పరిధిలో రోజుకు 3వేల నుంచి 3,500 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఆర్టీఏ ఆఫీస్‌లో అడుగుపెట్టగానే.. ఏజెంట్లే ఎదురువస్తున్నారు. ఆఫీసుల్లో ఏజెంట్లకు స్థానం లేదని గతంలో ఉన్నతాధికారులు సర్క్యూలర్ జారీ చేసినా ఫలితం లేకుండా పోతున్నది. ఏ పని చేయించుకోవాలన్నా.. వేలల్లో డిమాండ్ చేస్తున్నారు.
ఆ ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమే
షోరూమ్‌లలో వెహికల్ కొన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ప్రస్తుతం వాహన్, సారథి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని డేటా కేంద్ర సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో సారథి మాత్రమే అమల్లో ఉన్నది.
వాహన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఏపీ, మరికొన్ని రాష్ట్రాల్లో షోరూమ్స్‌లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. రాష్ట్రంలో అమలు చేసే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏజెంట్ల జోక్యం లేకుండా చూస్తున్నం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పక చర్యలు తీస్కుంటం.
- రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్-
