దుమ్మురేపిన మద్యం అమ్మకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ లోనే రూ.279 కోట్ల అమ్మకాలు

దుమ్మురేపిన మద్యం అమ్మకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ లోనే రూ.279 కోట్ల అమ్మకాలు
  • గత డిసెంబర్ కంటే రూ.50 కోట్లు అదనం
  • కొత్త దుకాణాల ఓపెనింగ్, పంచాయతీ ఎన్నికలతో అమ్మకాలు జంప్ 
  • రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.216 కోట్ల ఆదాయం 

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు దుమ్మురేపాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ దారుల ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి. వైరా లిక్కర్ డిపోలో మొదటి నెలలో రూ.279 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాకు ఇక్కడి నుంచి మద్యాన్ని తరలిస్తారు. 

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈసారి డిసెంబర్ చివరి వారంలో అమ్మకాల జోష్ కనిపించింది. గతేడాది డిసెంబర్ నెలలో రూ.228 లిక్కర్ సేల్స్ జరగ్గా, ఈసారి అంతకంటే రూ.51 కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. చివరి వారంలోనే ఏకంగా రూ.66 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇన్ వాయిస్ రేటు ప్రకారం రూ.2,259 విలువైన అమ్మకాలు జరిగాయి. 

ఎమ్మార్పీ రేటు ప్రకారం వీటి విలువ రూ.2,650 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 116 వైన్ షాపులు, 41 బార్లు, రెండు క్లబ్ లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 వైన్ షాపులు, 14 బార్లు, మూడు క్లబ్ లున్నాయి. కొత్తగా లైసెన్స్ లు దక్కించుకున్న వారు పూర్తిగా స్టాక్ ను కొత్తగా తీసుకోవడం, పంచాయతీ ఎన్నికలు కూడా ఈసారి అమ్మకాలకు కలిసి వచ్చాయి.

డ్రంకెన్ డ్రైవ్ కేసులు అదే స్థాయిలో.. 

మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగినట్లుగానే డ్రంకెన్ డ్రైవ్ కేసులు అదే స్థాయిలో నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2024లో 6,577 నమోదు కాగా, 2025లో 16,243 కేసులు నమోదయ్యాయి. ఏకంగా దాదాపు 10 వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గతేడాది దాదాపు 15,500 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిన వారు భద్రాద్రి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు రూ. కోటిన్నరకు పైగా ఫైన్ చెల్లించిన 
దాఖలాలున్నాయి.

ఇక రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.216 కోట్ల ఆదాయం.. 

రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.216 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 47,374 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2024లో 46,066 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తో రూ.221.29 కోట్ల ఆదాయం వచ్చింది. దీనితో పోలిస్తే గతేడాది రూ.5 కోట్ల ఆదాయం తగ్గింది. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, ఖమ్మం రూరల్, కూసుమంచి, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, ఇల్లందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. గతేడాది ఒక్క ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచే 12,689 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా, రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. 

రెండో స్థానంలో ఖమ్మం రూరల్ లో 7,944 డాక్యుమెంట్లకు గాను రూ.31.66 కోట్ల ఆదాయం వచ్చింది. తక్కువగా భద్రాచలంలో 72 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు గాను రూ.60 వేల ఆదాయం వచ్చింది. కొత్తగూడెంలో రూ.26.71 కోట్లు, కూసుమంచిలో రూ.17 కోట్లు, సత్తుపల్లిలో రూ.9.73 కోట్లు, మధిరలో రూ.9.67 కోట్లు, వైరాలో రూ.7.87 కోట్లు, కల్లూరులో 4.22 కోట్లు, బూర్గంపహాడ్ లో రూ.92 లక్షలు, ఇల్లందులో రూ.90 లక్షల ఆదాయం వచ్చింది.