పదిలో నెంబర్​ వన్​ నిర్మల్

పదిలో నెంబర్​ వన్​ నిర్మల్

నిర్మల్, వెలుగు:  
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. 99% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ఫస్ట్​ ప్లేస్​ సాధించింది. గత విద్యా సంవత్సరం  మొదటి స్థానంలో  నిలిచిన సిద్ది పేటను వెనక్కి నెట్టి ఈ ఘనత దక్కించుకుంది. మొత్తం 9 ,071 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8 ,980 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.   4,442 మంది బా లురకు 4 ,392 మంది బాలురు, 4 ,629 మంది బాలికలకు 4 ,558 మంది బాలికలు పాసయ్యారు.  మొత్తం 99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా స్టేట్ టాప్ గా నిలిచింది. జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్, జడ్పీ, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు చాలా మంది 10 జీపీఏతో ఉత్తీర్ణత సాధించారు.  గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ తో పోటీపడి మెరుగైన ఫలితాలు రాబట్టారు.

ఆదిలాబాద్​ కు 19 వ స్థానం 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; ఆదిలాబాద్​ జిల్లా బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో రాష్ర్ట స్థాయిలో 19వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 10,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 9,366  మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5240 మందిలో 4611 మంది ఉత్తీర్ణ సాధించగా, బాలికలు 5322 మందిలో 4,755 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 88 శాతం, బాలికలు 89.35 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జిల్లాలో మొత్తం 88.68 శాతం  ఉత్తీర్ణత నమోదయింది.

మంచిర్యాలకు 23 వ స్థానం

మంచిర్యాల, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వెనుకబడ్డది. 84.87 శాతం ఉత్తీర్ణతతో రాష్ర్టస్థాయిలో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 10,076 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,552 మంది పాసయ్యారు. బాలురు 5,230 మందికి గాను  4,336 మంది (82.91 శాతం), బాలికలు 4,846  మందికి 4,216 మంది (87 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 79 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఇందులో ప్రైవేట్​ స్కూల్స్ స్టూడెంట్లు​ 67 మంది, గవర్నమెంట్ స్కూల్స్​ నుంచి 12 మంది ఉన్నారు.  

సీఓఈలో 100 శాతం ఉత్తీర్ణత

బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్సీ (సీఓఈ) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.  మొత్తం 72 మంది పరీక్షకు హాజరు కాగా అందరూ పాసయ్యారు.  కొండగొర్ల సిద్దార్థ10 జీపీఏ సాధించగా, నీలాల అభిరామ్, గోమాస యశ్వంత్ 9.8 జీపీఏ, మరో ఐదుగురు 9.7 జీపీఏ సాధించారు. 29 మంది విద్యార్థులు 9 జీపీఏ, ఆపైన సాధించారు. విద్యార్థులను ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఆర్సీవో  కొప్పుల స్వరూపరాణి, ప్రిన్సిపల్​ ఐనాల సైదులు  అభినందించారు.

వెనకబడ్డ ఆసిఫాబాద్ జిల్లా..

ఆసిఫాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన జిల్లా గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఢీలా పడింది. రాష్ట్రంలో 30 స్థానంలో నిలిచిన జిల్లాలో ఒక్కరు కూడా 10 జీపీఏ సాధించకపోవడం గమనార్హం.ఆసిఫాబాద్ జిల్లా 30వ స్థానంలో  నిలిచింది.  జిల్లాలో మొత్తం 6628 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 5061 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు.  జిల్లా ఉత్తీర్ణత శాతం 76.36 ఉంది. ఇందులో బాలురు 72.69 కాగా బాలికలు 79.48 గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా తిర్యాణి, లింగాపూర్ కేజీబీవీ పాఠశాలల్లో మత్రమే 100శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా ఉత్తీర్ణత పొందిన వారిలో 150 మందికి పైగా 9 ఆపై జీపీఏ వచ్చినట్లు అధికారులు వివరించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన అదీబా తెహ్రీన్ 9.8 .జీపీఏ సాధించి జిల్లాలో ఏకైక విద్యార్థినిగా నిలిచింది.

సమష్టి కృషితోనే  ..

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు టీచర్లు, సంబంధిత శాఖ అధికారులంతా సమష్టిగా కృషి చేయడం అభినందనీయం.  ప్రణాళికాబద్ధమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని గత మూడు నెలల నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాం. 

- డీఈవో, రవీందర్ రెడ్డి, నిర్మల్