రేప్ కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్టు

రేప్ కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్టు

నిర్మల్ టౌన్, వెలుగు: రేప్ కేసులో నిందితుడైన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన మరో ఇద్దరు అన్నపూర్ణ  అలియాస్ అను, కారు డ్రైవర్ జాఫర్ అలియాస్ వసీంలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సాజిద్ పై పోక్సో కేసు పెట్టిన పోలీసులు.. తాజాగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. ‘‘సాజిద్ కు అన్నపూర్ణ అనుచరురాలిగా వ్యవహరిస్తోంది. ఆమెకు తన తండ్రితో ఉన్న వివాదాన్ని  పరిష్కరించడంతో పాటు ప్లాట్ గిఫ్టుగా ఇస్తానని అన్నపూర్ణను సాజిద్ ప్రలోభపెట్టాడు. స్థానిక కాలనీకి చెందిన బాలికను హైదరాబాద్ తీసుకురావాలని ఆమెకు చెప్పాడు. దీంతో అన్నపూర్ణ బాధితురాలి తల్లితో మాట్లాడింది. నిజామాబాద్ లో ఫంక్షన్​కు బాలికను తీసుకెళ్తానంటూ నమ్మించింది. ప్లాన్ ప్రకారం ఈ నెల 9న బాలికను మొదట బస్సులో సోఫీనగర్ వరకు తీసుకువెళ్లి, అక్కడి నుంచి కారులో హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ రెండ్రోజులు బాలికపై అత్యాచారం చేసిన సాజిద్.. తిరిగి నిర్మల్ తీసుకొచ్చాడు. బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అన్నపూర్ణ బెదిరించింది. అయినప్పటికీ బాలిక తల్లి భయపడకుండా సఖి కేంద్రాన్ని ఆశ్రయించి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది” అని డీఎస్పీ వివరించారు. 

అకోలాకు పరార్.. 
పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని తెలిసి సాజిద్, అన్నపూర్ణ, జాఫర్ మహారాష్ట్రలోని అకోలాకు పరారయ్యారని డీఎస్పీ చెప్పారు. ‘‘అకోలా నుంచే యాంటిసిపేటరీ బెయిల్  కోసం హైదరాబాద్ లోని లాయర్ తో ప్రయత్నించారు. లాయర్ ఇచ్చిన హామీ మేరకు అకోలా నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిర్మల్ మండలంలోని నిలాయ్ పేట హైవేపై ముగ్గురినీ పట్టుకున్నాం. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులను గురువారం కోర్టులో ప్రవేశపెడతాం” అని తెలిపారు.