నిర్మల్​లో ఐదుగురు కిడ్నాపర్ల అరెస్ట్

నిర్మల్​లో ఐదుగురు కిడ్నాపర్ల అరెస్ట్
  • నిర్మల్​లో ఐదుగురు కిడ్నాపర్ల అరెస్ట్
  • ఆర్ఎంపీని కిడ్నాప్​ చేసి రూ.5 లక్షలు డిమాండ్
  • నిందితులను పట్టుకున్న వంజర ప్రజలు 


నిర్మల్, వెలుగు: ఓ ఆర్ఎంపీని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసిన ఐదుగురు కిడ్నాపర్లను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిర్మల్​ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం జౌలి గ్రామానికి చెందిన యువతి(22)కి పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. పిల్లలు కలగకపోవడంతో కుమ్మరికుంటకు చెందిన ఆర్ఎంపీ అక్కిరాల రవికుమార్ వద్దకు ట్రీట్​మెంట్​ కోసం వెళ్లింది. వీరిద్దరికీ సన్నిహిత సంబంధం ఏర్పడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించిన జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన బానోత్ మారుతి, మహారాష్ట్రకు చెందిన రాథోడ్ ఉద్దల్, రాథోడ్ కార్తీక్, నర్సాపూర్ మండలం బురుగుపల్లికి చెందిన రాథోడ్ జ్ఞానేశ్వర్ ఈ యువతితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రవికుమార్​ను కిడ్నాప్ చేయాలని ప్లాన్​ వేశారు. 

ఫోన్ చేసి.. అడవిలోకి తీసుకెళ్లి

రవిని వివాహిత ఈ నెల 18న నిర్మల్​కు రప్పించింది. జ్ఞానేశ్వర్​ను తన బంధువుగా పరిచయం చేసి అతడి కారులో మహారాష్ట్రలోని ధనోరా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. యువతి కారు దిగగానే రెండు బైకులపై వచ్చిన మారుతి, ఉద్దల్, కార్తీక్​తో పాటు జ్ఞానేశ్వర్.. రవిని తాళ్లతో కట్టేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలని తుపాకీతో బెదిరించారు. జ్ఞానేశ్వర్​తో యువతి బైక్ పై వెళ్లిపోయింది. సాయంత్రం రవిని మారుతి, ఉద్దల్, కార్తీక్ తో పాటు అంకమల్ల శ్రావణ్ కారులో ఎక్కించుకుని కంకట గ్రామ శివారుకు తీసుకెళ్లి కొట్టారు. చివరకు రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు రవి ఒప్పుకున్నాడు. రాత్రి 11 గంటలకు అతడి మిత్రుడు రామకృష్ణకు ఫోన్ చేసి ఫోన్ పేలో డబ్బులు పంపాలని డిమాండ్​ చేశారు. అప్పటికే రవి కిడ్నాప్ విషయం తెలుసుకున్న రామకృష్ణ.. లొకేషన్ ను ట్రేస్ చేస్తున్నామని, మిమ్మల్ని పట్టుకుంటామని బెదిరించారు. దీంతో మారుతి అక్కడి నుంచి వెళ్లిపోగా ఉద్దల్, కార్తీక్.. రవిని తీసుకుని బైక్​పై వంజర గ్రామం వైపు తీసుకెళ్లారు. దొంగల భయంతో గస్తీ కాస్తున్న గ్రామస్తులకు బైక్​పై బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకుపోతున్న దృశ్యం చేసిన గ్రామస్తులు వారిని వెంబడించి అడ్డుకున్నారు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న రవి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మారుతి, ఉద్ధల్, కార్తీక్, జ్ఞానేశ్వర్లతోపాటు వివాహితను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటు తుపాకీ, రెండు తూటాలు, 5 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న శ్రావణ్ కోసం గాలింపు చేపట్టారు.