ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

స్వతంత్ర భారతదేశంలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆరో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. ఈ రికార్డుతో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం వంటి లెజెండ్‌ల పక్కన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరారు. 

* 2019  నుండి ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఐదు వరుస వార్షిక ఆర్థిక నివేదికలను సమర్పించిన మంత్రులలో అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ తో పాటు మొరార్జీ దేశాయ్ కూడా ఉన్నారు.

* 2014లో మోడీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత జైట్లీ 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించారు. 2017లో జైట్లీ అనారోగ్యం నేపథ్యంలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయం నుండి వైదొలిగారు. దీంతో అదనపు మంత్రిత్వ శాఖను చేపట్టిన పీయూష్ గోయల్ 2019-20 మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్‌ను సమర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోడీ 2.0 ప్రభుత్వంలో సీతారామన్‌కు ఆర్థిక శాఖను కేటాయించారు.

* సీతారామన్ ఆధ్వర్యంలో కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు, దేశాన్ని ఆర్థికంగా బలపరిచేందుకు పలు నిర్ణయాలు వెలువరించారు. 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించిన ఇందిరా గాంధీ తర్వాత 2019లో బడ్జెట్‌ను సమర్పించిన రెండవ మహిళగా సీతారామన్ ఖ్యాతి గడించారు. ఆ సంవత్సరమే సంప్రదాయ బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను తీసివేసి, దానికి బదులుగా ప్రసంగం, ఇతర పత్రాలను తీసుకువెళ్లడానికి జాతీయ చిహ్నంతో కూడిన 'బహీ-ఖాతా' ను పరిచయం చేశారు.

ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులు...

* యూపీఏ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ కంటే ముందు కాంగ్రెస్‌కు చెందిన పి చిదంబరం 2004 -05 నుండి 2008- -09 వరకు వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించారు.

* బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు1998 -99 మధ్యంతర, చివరి బడ్జెట్‌లను సమర్పించారు.

*1999లో సాధారణ ఎన్నికల తర్వాత సిన్హా నాలుగు బడ్జెట్‌లను (1999-2000 నుండి 2002-03) సమర్పించారు. సిన్హా ఆధ్వర్యంలోనే బడ్జెట్‌ సమర్పణ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.

* పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్‌కు ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగించారు. ఆయన 1991-92 నుండి 1995-96 వరకు బడ్జెట్‌లను సమర్పించారు.

* ఇక మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌లను సమర్పించి.. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. వాటిలో ఐదు సార్లు వరుసగా సమర్పించిన వ్యక్తిగానూ రికార్డు సాధించారు. 1959-60 నుండి 1963-64 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐదు వార్షిక బడ్జెట్‌లను సమర్పించారు.