ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుంది: నిర్మలా సీతారామన్

ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుంది: నిర్మలా సీతారామన్

నవంబర్ 30న జరగబోయే ఎలక్షన్స్ తెలంగాణకు చాలా ముఖ్యమని.. ఈ ఎలక్షన్స్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలుపాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2023, నవంబర్ 21వ తేదీ మంగళవారం హైదరాబాద్  జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం  వెంగల్ రావు నగర్ లోని ముగ్ధ బాంకెట్ హాల్ లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014లో ఆంధ్ర-తెలంగాణ విభజన జరిగినప్పుడు.. మిగులు బడ్జెట్ తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెంది.. రెవెన్యూ సెంటర్ గా మారిందని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్ అని..  కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల హైదరాబాద్ కు మంచి కంపెనీలు  వస్తున్నాయని అన్నారు.  కుటుంబ పాలనా, అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? ... మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే.. తెలంగాణ అప్పుల పాలవుతుందని అన్నారు.  ఒక్క ప్రాజెక్టును సరిగ్గా పూర్తి చేయాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయిందని.. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్ లో రాష్ట్రాలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిందని చెప్పారు. 

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్.. ప్రజలకు పనికొచ్చే  పనులు చేయడం లేదన్నారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్,  పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై దురదజల్లే ప్రయత్నం చేశారని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి.. మళ్లీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ తరుపున యంగ్ ఎమ్మెల్యే కాండిడేట్ ఉన్నాడని.. ఆయనకు సపోర్ట్ చేయండని నిర్మలా సీతారామన్ చెప్పారు.