డిజిటలైజేషన్ వల్ల ఎంతో మేలు 

డిజిటలైజేషన్ వల్ల ఎంతో మేలు 

హైదరాబాద్ : గుజరాత్ ఇవాళ పవర్ పుల్ స్టేట్ గా ఉందంటే కారణం ప్రధాని నరేంద్ర మోడీ ముందుచూపే అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాని మోడీ 20 ఏళ్ల పాలనపై ఆవిష్కరించిన బుక్ లో నాలుగు ప్రధాన అంశాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. డిఫెన్స్ రంగంలో 70 ఏళ్లలో ఎన్నడూ లేని నూతన ఆవిష్కరణలు ప్రధాని తీసుకొచ్చారని, కొన్ని ఉదాహరణలతో వివరించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్నవిద్యార్థులను క్షేమంగా ఇండియా తీసుకురాగలిగారని, ఈ విషయంలో ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజారోగ్యం విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాలపై డాక్టర్ శెట్టి రాసిన అంశాలు బాగున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై అశోక్ గులాటి గొప్పగా వివరించారని, హార్టికల్చర్ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో గుజరాత్ నెంబర్ వన్ స్థానంలో ఉందని, దానికి కారణం ప్రధాని మోడీనే అన్నారు. నరేంద్రమోడీ 20 ఏళ్ల పాలనపై ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. 

గుజరాత్ ను ప్రధాని మోడీ అభివృద్ధి చేసిన విధానాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నెలకు ఒక్కసారైనా దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ మాట్లాడతారు. పథకాల అమలు, జిల్లా ప్రగతిపై ఆరా తీస్తారన్న ఆమె.. వెనకబడిన జిల్లా అంటే ఒప్పుకోరు. అభివృద్ధికి కావాల్సిన వనరులు గుర్తించమని చెప్తారన్నారు. మంత్రులను అలర్ట్ చేస్తారు. వెనకబడిన జిల్లా కాదు... ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా గుర్తించాలి అని చెప్తారని గుర్తు చేశారు. ఏదైనా పథకం కోసం  కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు పెడుతోంది అంటే... కేంద్రం ఇచ్చే 60 శాతం అందుతుందా.. లేదా అని క్లియర్ గా తెలుస్తోంది అంటే.. డిజిటలైజేషన్ వల్లే అని తెలిపారు. ఖర్చు పెట్టె ప్రతీ రూపాయి లబ్ధిదారులకు చేరాలి అని ప్రధాని మోడీ చూస్తారని, డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహించడం ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందో  బుక్ లో గొప్పగా వివరించారన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 40 ఏళ్లకు పైగా ఇండియాని ఒక పార్టీ, ఒక కుటుంబం పాలించిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఇప్పటికీ తలెత్తుకుని తిరిగే పరిస్థితులు లేవని, 40ఏళ్ళ పాలనలో అంతా అవినీతిమయం అయ్యిందన్నారు. ప్రధాని మోడీ పాలనలో పరిస్థితులు మారాయని, చారిత్రాత్మక మార్పు వచ్చిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించకపోయినా.. తెలుగు రాష్ట్రాలను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి అన్నిరకాలుగా అభివృద్ధికి సహకరించారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.