- ఐఎంఎఫ్ అంచనాలను పేర్కొంటూ రాజ్యసభలో మంత్రి నిర్మల ప్రకటన
- అన్ని సెక్టార్లు వృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
- సార్ఫేసీ చట్టంతో రూ. 32,466 కోట్ల మొండిబాకీలను రికవరీ చేసిన బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2028–-29 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో మంగళవారం పేర్కొన్నారు. ఇంకో రెండేళ్లలో మన జీడీపీ 5.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. రాజ్యసభలో ఈ అంచనాలను సీతారామన్ ప్రస్తావించారు.
అన్ని సెక్టార్లలో వృద్ధి చెందుతూ ఈ మైలురాయిని చేరుకుంటామని, ఇందుకోసం బ్రాడ్‌బేస్డ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఈలకు మద్ధతుగా నిలవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
జీఎస్‌టీ, ఇన్‌కమ్ ట్యాక్స్ సంస్కరణలతో ఎటువంటి అడ్డంకులు లేని ట్యాక్స్ సిస్టమ్‌ను డెవలప్ చేశామని అన్నారు. ‘‘ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఖర్చులు పెంచడం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐ) రూల్స్‌ను సులభతరం చేయడం, ఎక్స్‌పోర్ట్స్‌ను పెంచడం, ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఈ స్ట్రాటజీని అమలు చేస్తున్నాం. ఖర్చులు తగ్గించుకొని, ఆదాయం పెంచుకుంటూ క్రమశిక్షణతో ద్రవ్యలోటును మేనేజ్ చేస్తున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్‌తో ఎగుమతులు పెరుగుతున్నాయి”అని సీతారామన్ వివరించారు.
వివిధ సెక్టార్ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు..
వ్యవసాయ రంగం: సాగునీటి ప్రాజెక్టులలో పెట్టుబడులు, టెక్నాలజీపై అవగాహన పెంచడం, డిజిటల్ అగ్రిమిషన్, పంటల వైవిధ్యం, మార్కెట్ సదుపాయాల మెరుగుదల ద్వారా ఉత్పాదకతను పెంచడం.
తయారీ, మౌలిక వసతులు: ‘మేక్ ఇన్ ఇండియా’, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పీఎం గతిశక్తి ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచి భారీగా ఉపాధి కల్పించడం.
ఎంఎస్ఎంఈలకు ఊతం: ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్, ఉచిత 'ఉద్యమ్' రిజిస్ట్రేషన్, 'పీఎం విశ్వకర్మ' యోజన, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్‌ఈడీఎస్) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక చేయూత.
సేవా రంగం, డిజిటల్ విప్లవం: డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఏఐకి ప్రోత్సాహం ద్వారా సేవా రంగాన్ని బలోపేతం చేయడం.
భవిష్యత్ రంగాలు, నైపుణ్యాభివృద్ధి: సెమీకండక్టర్లు, బయోఫార్మా, క్లీన్ ఎనర్జీ, రేర్ ఎర్త్స్ వంటి వ్యూహాత్మక రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, 'పీఎంసేతు' పథకం కింద అప్‌గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం.
- మొండిబాకీలు తగ్గించేందుకు చట్టం
కేంద్ర బడ్జెట్ 2026-–27 లో ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ప్రాంతీయ మెడికల్ హబ్‌లు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) ల్యాబ్‌లు వంటివి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ (సర్ఫేసీ) ద్వారా రూ. 32,466 కోట్ల మొండిబాకీలను బ్యాంకులు రికవరీ చేయగలిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి వివరించారు.
2024-–25 ఆర్థిక సంవత్సరంలో సర్ఫేసీ చట్టం కింద బ్యాంకులు మొత్తం 2,15,709 కేసులను నమోదు చేశాయని, వీటిలో రూ. 1,03,180 కోట్ల నిధులు ఇరుక్కుపోయాయని తెలిపారు. కఠినమైన చర్యల ద్వారా ఇందులో రూ. 32,466 కోట్లను విజయవంతంగా రికవరీ చేయగలిగాయని నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు వివరించారు.
