ఆరోసారి బడ్జెట్.. మాజీ ప్రధాని రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్

ఆరోసారి బడ్జెట్..  మాజీ ప్రధాని రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్

లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర అర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు.  పార్లమెంట్ లో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం.  2019  జూలై నుండి ఐదుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ఈ సారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో  గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తరువాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన అర్థిక శాఖ మంత్రిగా ఆమె ఆరుదైన ఘనత సాధించారు. 

మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఆయన గరిష్టంగా లోక్‌సభలో పదిసార్లు బడ్జెట్ సమర్పించారు.  ఇక  లోక్‌సభలో మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హాలు ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఇందిరా గాంధీ తరువాత  పార్లమెంట్ లో  బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండో మహిళా నిర్మలా సీతారామన్ కావడం విశేషం.  

2014లో బీజేపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత, అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2014-15 నుండి 2018-19 వరకు వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించారు. 2019 ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ 2019-20 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. జూన్‌లో ఏర్పడే అవకాశం ఉన్న కొత్త ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన తుది బడ్జెట్‌ను జులైలో ప్రవేశపెట్టనుంది.