కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.30.42 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఆమె బడ్జెట్ తీసుకొచ్చారు. అయితే ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. రికార్డు క్రియేట్ చేస్తూ రెండున్నర గంటలకు పైగా బడ్జెట్ చదివిన ఆమె అలసిపోయారు. రెండు పేజీలు మిగిలి ఉండగా.. బీపీ, షుగర్ డౌన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. చమటలు పట్టేయడంతో ఇద్దరు బీజేపీ ఎంపీలు ఆమె దగ్గరకు వచ్చారు. అప్పటికీ షుగర్ గోలీలు వేసుకుని, బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె చదవలేకపోయారు.
పక్కనే ఉన్న ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్వాలేదన్నట్లు చేతితో సైగలు చేశారు. దీంతో మిగిలిన రెండు పేజీలను సభకు తెలియజేసినట్లుగా భావించాలని స్పీకర్‌ను కోరారు నిర్మలా సీతారామన్. ఆమె అభ్యర్థనకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
