రోడ్డు ప్రమాదంలో నిట్​ స్టూడెంట్​ మృతి

రోడ్డు ప్రమాదంలో నిట్​ స్టూడెంట్​ మృతి
  • జంగాలపల్లి వద్ద డివైడర్​ను ఢీకొట్టిన కారు..
  • మరో నలుగురికి తీవ్ర గాయాలు
  • లక్నవరం వెళ్లి వస్తుండగా ప్రమాదం 

ములుగు/ఖాజీపేట, వెలుగు : ములుగు మండలం జంగాలపల్లి క్రాస్​ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నిట్​ స్టూడెంట్ చనిపోయింది. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని ఏలూరుకు చెందిన తాడేపల్లి నిస్సీ / సిజు (18), విజయవాడకు చెందిన శ్రేయ, హైదరాబాద్​కు చెందిన ముర్తుజా, ఉమర్, సాయి, సుజిత్​వరంగల్​లోని నిట్​లో బీటెక్ ​సెకండ్​ఇయర్​ (సివిల్) చదువుతున్నారు. బుధవారం వీరంతా కలిసి ఓ కారు అద్దెకు తీసుకుని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సును చూసేందుకు వచ్చారు. 

రాత్రి కాటేజీల్లో స్టే చేసి గురువారం క్లాసులు మిస్ ​కావద్దనే ఉద్దేశంతో తెల్లవారుజామున 4 గంటలకే వరంగల్​కు బయలుదేరారు. ముర్తుజా కారు నడుపుతుండగా ములుగు మండలం జంగాలపల్లి వద్దకు రాగానే కారు డివైడర్​ను ఢీకొట్టి పల్టీలు కొట్టి అక్కడే ఆగి ఉన్న లారీ కిందికి చొచ్చుకుపోయింది. తీవ్రంగా గాయపడిన నిస్సీ అక్కడికక్కడే చనిపోయింది. 

శ్రేయ, ముర్తుజా, ఉమర్​,సాయి తీవ్రంగా గాయపడ్డారు. సుజిత్​కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ములుగు ఏరియా దవాఖానకు తరలించి అక్కడి నుంచి వరంగల్​లోని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​కు షిఫ్ట్ ​చేశారు. సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​ లోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకువెళ్లారు.  నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్ ​తెలిపారు.