టీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్

టీకా ఉత్పత్తి వేగవంతం.. మరిన్ని కంపెనీలకు కేంద్రం లైసెన్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి రక్షణనిచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని కేంద్రం అంటోంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టీకా డిమాండ్ ను చేరుకోవడానికి, ఉత్పత్తిని పెంచడం కోసం మరిన్ని దేశీ కంపెనీలకు లైసెన్సులు ఇస్తున్నామని గడ్కరీ స్పష్టం చేశారు. 

'వ్యాక్సిన్ ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం సమస్యను పెంచుతోంది. అందుకే టీకా తయారీ పనులను పది సంస్థలకు ఇస్తున్నాం. అందుకు అవసరమైన లైసెన్సులను మంజూరు చేస్తున్నాం. ఈ కంపెనీలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ లు దేశీ అవసరాలకు సరిపోయి.. ఇంకేమైనా మిగులు టీకాలు ఉంటే విదేశాలకు ఎగుమతి చేస్తాం. ప్రతి రాష్ట్రంలోనూ రెండు, మూడు ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇవే టీకాలు తయారు చేస్తాయి. ఇందుకు వారికి 10 శాతం రాయల్టీ ఇస్తాం. 15 నుంచి 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం' అని గడ్కరీ పేర్కొన్నారు.