- నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆయన ప్రతీ మాటా మాకు దిశానిర్దేశం
- నబిన్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ‘సంగఠన్ పర్వ్’
న్యూఢిల్లీ: ఇకనుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తన బాస్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తను అని తెలిపారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సంగఠన్ పర్వ్’లో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్‌ను ఆయన అభినందించారు. ‘‘పార్టీ విషయాల్లో నేను కేవలం ఒక కార్యకర్తను మాత్రమే. నితిన్ నబిన్ నా బాస్. ఆయన చెప్పే ప్రతి మాట మాకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ఆయన మార్గదర్శకత్వం మా భవిష్యత్తు కార్యాచరణకు అమూల్యమైన ఆస్తి’’ అని వ్యాఖ్యానించారు.
గత 11 ఏండ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీ అధ్యక్షుడికి నివేదిస్తున్నానని, తన పనితీరుకు ఆయనే మార్కులు వేస్తారని అన్నారు. కేవలం బీజేపీని నడపడమే కాకుండా, ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల మధ్య సమన్వయం సాధించాల్సిన బాధ్యత కూడా నబిన్‌పై ఉందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. జగత్ ప్రకాశ్ (జేపీ) నడ్డా స్థానంలో మంగళవారం ఆయన ఈ కీలక బాధ్యతలను చేపట్టారు. పార్టీ క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అత్యంత పారదర్శకంగా సాగిన అంతర్గత ఎంపిక ప్రక్రియ తర్వాత ఈ నియామకం ఖరారైంది.
45 ఏండ్ల వయసులో జాతీయ అధ్యక్షుడి స్థాయికి చేరి.. బీజేపీ చరిత్రలో ఇంత చిన్న వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నబిన్ నిలిచారు. 45 ఏండ్ల నితిన్ నబిన్ నియామకం ద్వారా బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచుకోవడంతోపాటు.. యువ నాయకత్వానికి పెద్ద పీట వేసింది.
ఈ ఏడాది, వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్, తమిళనాడు, అస్సాం, యూపీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నది.
