మహిళలకు సీఎం భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 35 రిజర్వేషన్లు

మహిళలకు సీఎం భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 35 రిజర్వేషన్లు

పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీహార్ మహిళలకు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో బీహార్ మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారత, వారికి ఉపాధి కల్పించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది బీహార్ సర్కార్. దీంతో పాటు యూత్‎ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి శిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడం కోసం బీహార్ యువజన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యం, ఉద్యోగ నియామకాలను మెరుగుపరచడాన్ని బీహార్ యూత్ కమిషన్ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిషన్‎కు ఒక చైర్ పర్సన్, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఏడుగురు సభ్యులు ఉంటారు. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారే యూత్ కమిషన్లో ఉంటారని స్పష్టం చేసింది ప్రభుత్వం.

 బీహార్ యూత్ కమిషన్ రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని పర్యవేక్షించడంతో పాటు బీహార్ వెలుపల పనిచేసే విద్యార్థులు, నిపుణుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. అలాగే యువత మాదకద్రవ్యాలు, మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా.. అడిక్ట్ అయిన వారిని కౌన్సింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 

►ALSO READ | దేశంలోని స్కూల్స్ పిల్లలను పేదలుగా మారుస్తున్నాయా..: సోషల్ మీడియాలో చర్చ ఎందుకు..?

కాగా, ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నదని.. ఈ సారి అధికార కూటమికి గెలుపు సవాలేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెజార్టీ ఓటు బ్యాంక్‎గా ఉన్న మహిళలు, యూత్‎కు దగ్గరకావడంపై నితీష్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే  ఎన్నికలకు ముందు మహిళలు, యువతపై వరాల జల్లు కురిపిస్తోంది.