ఇండియా కూటమి కన్వీనర్​గా నితీశ్!

ఇండియా కూటమి కన్వీనర్​గా నితీశ్!
  •     కూటమిలోని పార్టీ లీడర్లను సంప్రదిస్తున్న కాంగ్రెస్
  •     అంగీకరించిన లాలూ ప్రసాద్, అర్వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ  :  లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కన్వీనర్​గా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నియామకం అవుతున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఇండియా కూటమిలోని వివిధ పార్టీల లీడర్లు వర్చువల్ గా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి కన్వీనర్​గా నితీశ్ కుమార్ ను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నితీశ్ కుమార్ నియామకం విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్​తో కూడా చర్చించినట్టు సమాచారం. నితీశ్ అపాయింట్​మెంట్​కు లాలూ మద్దతు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా, కాంగ్రెస్ లీడర్లు నితీశ్ కుమార్ ముందు ప్రతిపాదన పెట్టగా.. ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం.

అయితే, త్వరలో జరిగే ఇండియా కూటమి వర్చువల్ భేటీలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇండియా కూటమిలోని వివిధ పార్టీల లీడర్లతో కాంగ్రెస్ ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. కూటమి కన్వీనర్​గా నితీశ్​ను నియమిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల ముందుంచినట్టు సమాచారం. ఈ విషయమై నితీశ్​​తో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ముందు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించగా.. ఆయన కూడా నితీశ్ కుమార్​కు మద్దతు ఇచ్చినట్టు తెలిసింది. నితీశ్​కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించినా.. కాంగ్రెస్​కు ఎలాంటి ఇబ్బంది ఉండదని రౌత్ తెలిపారు. అయితే, కన్వీనర్​గా నితీశ్ కుమార్ పేరు ఎంపిక విషయం తమ దృష్టికి రాలేదని ఎన్​సీపీ సీనియర్ లీడర్ సుప్రియా సూలే చెప్పారు. జనవరి 30 నుంచి లోక్​సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని కూటమి పార్టీల లీడర్లు భావిస్తున్నారు.