ఆర్టికల్ 370 రచ్చ..బీజేపీపై నితీశ్ అసమ్మతి!

ఆర్టికల్ 370 రచ్చ..బీజేపీపై నితీశ్ అసమ్మతి!

లోక్​సభ ఎన్నికలు పూర్తయిన వేళ.. ఎన్డీయే కూటమిలో ‘నితీశ్’ బాంబు పేలింది. నిన్న మొన్నటి వరకు సైలెంట్​గా ఉన్న బీహార్​ సీఎం నితీశ్​కుమార్.. ఆదివారం తన అసమ్మతి వెళ్లగక్కారు. ఆర్టికల్ 370, 35ఏను తొలగించాలని చాన్నాళ్లుగా బీజేపీ పట్టుబడుతుంటే.. తాము మాత్రం దానికి అనుకూలం కాదని స్పష్టం చేశారు. గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​ను బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఎండాకాలంలో ఇంత సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. చివరి, ఏడో దశ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఆర్టికల్ 370, 35ఏ తొలగింపును ఒప్పుకోం

జమ్మూకాశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌-370, అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే ఆర్టికల్ 35ఏను తొలగించేందుకు తామ అనుకూలం కాదని నితీశ్ స్పష్టం చేశారు. దీనిపై 1996 నుంచి తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఈ ప్రొవిజన్స్ విషయంలో వేలుపెడితే, దేశ సమగ్రత, ఐక్యతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గతంలోనూ ఆయన హెచ్చరించారు. ఆయోధ్య విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన నితీశ్.. కోర్టు ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

సాధ్వీ వ్యాఖ్యలను సహించబోం

భోపాల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. గాడ్సే విషయంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. ఆమెను బీజేపీ నుంచి బహిష్కరించాలన్నారు. అయితే ఇది బీజేపీ వ్యక్తిగత అంశమన్నారు. మూడు ‘సీ’(క్రైమ్, కమ్యూనలిజం, కరప్షన్) విషయంలో తమ ప్రభుత్వం ఎన్నడూ రాజీపడలేదన్నారు.

ఎండాకాలంలో ఎన్నికలేంటి?

ఎండాకాలంలో ఇంత సుదీర్ఘంగా లోక్​సభ ఎన్నికలు నిర్వహించడాన్ని నితీశ్ తప్పుబట్టారు. ఎలక్షన్లు రెండు లేదా మూడు ఫేజ్​లలోనే పూర్తి చేయాలన్నారు. ‘‘ఇంత ఎండ ఉన్నప్పుడు, సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించకూడదు. ఇది సరైన సమయం కాదు. ఫిబ్రవరి–మార్చిలో కానీ, అక్టోబర్– నవంబర్​లో కానీ నిర్వహించాలి. అది కూడా రెండు, మూడు దశల్లోనే పూర్తి చేయాలి. ఎక్కువ దశల్లో వద్దు” అని అన్నారు. అలాగే ఫేజ్​కు, ఫేజ్​కు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకూడదన్నారు. ‘‘ఎన్నికలు పూర్తయ్యాక, ఓ పార్టీ ప్రెసిడెంట్​గా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లెటర్లు రాస్తా. పార్టీల మధ్య ఎన్ని బేధాభిప్రాయాలున్నా, ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంపై చర్చించాలని కోరతా” అని నితిశ్‌ కుమార్‌ చెప్పారు. ఇది అందిరికీ మంచిదని, ముఖ్యంగా ఓటర్లకు మేలు చేస్తుందన్నారు. చెప్పారు.

మరి రాజీనామా చెయ్: రబ్రీదేవి

ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా బాధించి ఉంటే, ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని నితీశ్​కుమార్​ను ఆర్జేడీ నేత రబ్రీదేవి డిమాండ్ చేశారు. బీజేపీతోకలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి బయటికి రా వాలని, నితీశ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. బీహార్​లో తాము 40కి 40 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు.