ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రిగా నితీశ్ ఫిక్స్: అమిత్ షా

ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రిగా నితీశ్ ఫిక్స్: అమిత్ షా
  • ఇండియా కూటమివి కుటుంబ రాజకీయాలు
  • తేజస్విని సీఎం, రాహుల్​ను ప్రధాని చేయాలనుకుంటున్నరు
  • బిహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి విమర్శలు

దర్బంగా/సమస్తిపూర్/బెగుసరాయ్:‘లాలూ ప్రసాద్ తన కొడుకు తేజస్వీని బిహార్ సీఎంగా, సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు. కానీ.. ఆ రెండు సీట్లూ ఖాళీగా కావనే విషయం వారికి తెలియడంలేదు. బిహార్ సీఎం సీట్లో నితీశ్ కుమార్, ప్రధాని పదవిలో నరేంద్ర మోదీనే ఉంటారు. ఇది ఫిక్స్’’ అని మహాఘట్​బంధన్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బంగా, బెగుసరాయ్, సమస్తిపూర్​లో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. ‘‘దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను మేము బ్యాన్ చేశాం. ఆర్గనైజేషన్ సభ్యులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినం. ఒకవేళ బిహార్​లో కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పీఎఫ్ఐ సభ్యులు అసలు జైల్లో ఉంటారా? మేము యువతకే ఎక్కువ టికెట్లు ఇచ్చినం.

 కాంగ్రెస్, ఆర్జేడీవి కుటుంబ రాజకీయాలు. వాళ్లది మహాఘట్​బంధన్ కాదు.. అవినీతిపరుల బంధన్’’ అని అమిత్ ఎద్దేవా చేశారు. ఎన్నికల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లు తొలగిస్తుంటే.. రాహుల్, లాలూ ప్రసాద్​కు నచ్చడం లేదని విమర్శించారు. ఇద్దరూ కలిసి బిహార్​లో మళ్లీ జంగిల్ రాజ్​ను తీసుకురావాలనుకుంటున్నారని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి హయాంలో హత్యలు, కిడ్నాప్‌‌‌‌లు, దోపిడీలు, మాఫియా కార్యకలాపాలు పెరిగాయని విమర్శించారు. 

ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేను లేదా సీఎంను ఎన్నుకోవడం కోసం కాదని, ‘జంగిల్ రాజ్’ కావాలా? లేక ‘వికాస్ రాజ్’ (అభివృద్ధి పాలన) కావాలా? అని నిర్ణయించుకోవడానికి జరుగుతున్నాయని అన్నారు. పంచ పాండవుల మాదిరి ఐదు పార్టీల ఎన్డీయే కూటమియే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌‌‌‌కు భారతరత్న ఇచ్చి.. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌’కు ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.

 ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రమంతా బంగ్లాదేశీ చొరబాటుదారులతో నిండిపోతుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఇటీవల బిహార్‌‌‌‌లో ‘చొరబాటుదారులను రక్షించే యాత్ర’ నిర్వహించారని ఆరోపించారు. ఎన్ని ర్యాలీలు నిర్వహించినా, చొరబాటుదారులను రక్షించలేరని హోంమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.