- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా
- యూపీ పార్టీ చీఫ్‌గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ
- త్వరలో అధ్యక్షుడిగానూ బాధ్యతలు!
న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వంలో రహదారుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న నితిన్ నబీన్ (45) బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఆ పదవికి నితిన్ ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పదవికి నితిన్ పేరు ఎంపిక చేసిన వెంటనే ఆయన నియామకం అమల్లోకి వచ్చిందని ఆయన వెల్లడించారు.
కాగా.. దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన.. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్ ను నిలబెట్టింది. అప్పటి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయనకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పూర్తయింది. కాగా.. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం కావడంపై నితిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా అభినందనలు తెలిపారు.
