వర్షాలతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 66 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్తుండడంతో ఇన్ ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్ వరద గురించి చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తో v6 ముచ్చటించింది. ప్రాజెక్టుకు మొత్తం 48 గేట్లున్నాయని, 9 గేట్లు మాత్రమే ఎత్తామన్నారు. జూలై నెలలో నిజాం సాగర్ లో 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, గతంలో నీరు లేకపోవడంతో మీటింగ్ లు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. 60 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నట్లు చెప్పారు.
పోచారం నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు
పోచారం నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, సింగూరు నుంచి వచ్చే నీటిని క్రమంగా అంచనా వేస్తున్నామని చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. ముందుజాగ్రత్త చర్యగా నీటిని కిందకు వదలడం జరుగుతోందన్నారు. మూడు సంవత్సరాల నుంచి వరుసగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు, వరదలు ఇంతస్థాయిలో గతంలో లేవన్నారు. గేట్లు ఎత్తివేసిన విషయాన్ని తాము పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియచేయడం జరిగిందన్నారు. మంజీరా నది నుంచి భారీగా నీరు వెళ్లే అవకాశం ఉందని.. నీళ్లు వెళుతున్న సమయంలో దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం భారీగా వరదల నేపథ్యంలో నిపుణులు, సీనియర్ ఇంజినీర్లు తమకు శిక్షణనిస్తున్నట్లు.. నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు.
