
- కలెక్టర్‌ను అభినందించిన సీఎం రేవంత్
నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి స్టేట్‌లో ఇందూర్ జిల్లా టాప్ స్థానంలో నిలబెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును అభినందించారు. మంగళవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, కలెక్టర్ ఆధ్వర్యంలోని ఆఫీసర్ల టీం అద్భుతంగా పనిచేసి రికార్డు సాధించారని కితాబునిచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ఇంకా 75 సెంటర్లు ఓపెన్..
గతేడాది యాసంగిలో 3.85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసిన తాము ఈ సీజన్లో కొనుగోళ్లను 8.19 లక్షల టన్నులకు చేర్చామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. 700 పైగా ఓపెన్ చేసిన కొనుగోలు సెంటర్లలో ఇంకా 75 నడుస్తున్నాయన్నారు. రైతులందరి నుంచి వడ్ల సేకరణ పూర్తయ్యాక వాటిని మూసేస్తామన్నారు. కొనుగోలు చేసిన దాంట్లో 93.24 వేల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం వడ్లు కాగా మిగితావన్నీ సన్నాలేనన్నారు. ఇప్పటి దాకా 1,00,535 రైతులకు రూ.1786.13 కోట్ల పేమెంట్స్ చేశామని వివరించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
డ్రైనేజీలను పరిశీలించిన కలెక్టర్
సిటీలోని డ్రైనేజీలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. డ్రైనేజీ కెనాల్స్ వర్షాలకు పొంగకుండా జేసీబీలు వినియోగించి డీసిల్టింగ్ చేయాలని సూచించారు. జేసీబీలు ఉపయోగించే వీలులేని చోట శానిటేషన్ సిబ్బంది సేవలు తీసుకోవాలన్నారు. గతేడాది ఇబ్బంది కలిగిన ఏరియాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.