
- నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లీడర్లలో టెన్షన్
- సొంత జిల్లాపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ స్పెషల్ ఫోకస్
నిజామాబాద్, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి సన్నాహాలు జరుగుతుండడం, టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే సంకేతాలు కనబడడంతో జిల్లా నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించనుందోనని హాట్ టాపిక్‌గా మారింది. మూడేండ్ల పదవీ కాలం పూర్తైన జిల్లాల్లో కొత్త అధ్యక్షులను నియమిస్తామని, ఈనెల 26, 27 తేదీల్లో ప్రకటించే చాన్స్ ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం నిజామాబాద్‌లో ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఏ పదవి వరించనుందోనని కాంగ్రెస్ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.
ఓసీలతో పాటు బీసీలు..
మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి డీసీసీ పోస్ట్‌పై ఆసక్తి చూపుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. వివాదరహితుడిగా ముద్ర ఉన్న ఆయన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అండతో డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్మూర్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి ఓటమిపాలైన వినయ్‌కుమార్‌రెడ్డి, బాల్కొండలో ఓడిపోయిన ముత్యాల సునీల్‌రెడ్డి కూడా ఈ పదవి కోసం ముమ్మరంగా యత్నిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలలో బీసీలకు ప్రయార్టీ ఇవ్వాలని డిమాండ్ ఉండడంతో జిల్లా నుంచి బీసీ లీడర్లను డీసీసీ పోస్టులో అపాయింట్ చేయాలనే ఒత్తిడి పెంచారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సన్నిహితుడి ముద్ర పొందిన శేఖర్‌గౌడ్ పదవి దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
మరో బీసీ నేత నరాల రత్నాకర్ గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్‌అలీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నుడా చైర్మన్ కేశవేణు కూడా బీసీ కోటాలో డీసీసీ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
స్టేట్ కమిటీలో కొందరికి చోటు..
ఈ నెలాఖరు టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తారని మహేశ్‌గౌడ్ ప్రకటించడంతో కొందరు జిల్లా నేతలను స్టేట్ కమిటీలో తీసుకుంటారని స్పష్టమవుతుంది. మహేశ్‌గౌడ్ సొంత జిల్లా అయినందున డీసీసీ అధ్యక్షుడి నియామకంలో ఆయన కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలన్నదానిపై క్లారిటీగా ఉండడంతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం.
క్రియాశీలం చేసే పదవిగా గుర్తింపు..
పార్టీలో ప్రొటోకాల్ పాటించే డీసీసీ పోస్ట్‌తో రాజకీయ మనుగడ సుస్థిరమవుతుందనే అంచనా నేతల్లో ఉండడంతో పోటీదారులు పెరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై ఆందోళనలు తదితర వాటితో బిజీగా ఉండాల్సి వస్తుంది. అదే రూలింగ్ పార్టీకి జిల్లా ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తే ప్రొటోకాల్ ఎంజాయ్ చేయొచ్చనే భావన లీడర్లలో ఉంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్, అన్వేశ్‌రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ ఆయా స్టేట్ కార్పొరేషన్లకు చైర్మన్ పోస్టులు పొందారు.
మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నప్పటికీ ఇప్పటికే జిల్లా నుంచి నలుగురు లీడర్లకు చాన్స్ లభించినందున ఇతరులకు అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తూ.. దానిని డీసీసీతో భర్తీ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. మున్ముందు లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నందున డీసీసీ పోస్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరేండ్ల పాటు డీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించిన మానాల మోహన్‌రెడ్డి రెండో విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది.