ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్..దసరా నాటికి గృహ ప్రవేశం లక్ష్యంగా ప్లాన్

ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్..దసరా నాటికి గృహ ప్రవేశం లక్ష్యంగా ప్లాన్
  • 2,637 మందికి రూ.30 కోట్ల బ్యాంక్​ లోన్​
  • 45 రోజులు దాటినా పనులు షురూ చేయకుంటే క్యాన్సిల్​

నిజామాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. పనులు పూర్తయ్యేలా  ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. జూలైలో మంజూరైన ఇండ్లు 45 రోజుల్లో ప్రారంభించేలా మండల ఆఫీసర్లు చొరవ తీసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణాలు ఏ దశకు వచ్చాయంటూ కలెక్టర్ నిత్యం అధికారులతో రివ్యూ చేస్తున్నారు. దసరా నాటికి గృహప్రవేశాలు కావాలని సూచిస్తున్నారు. అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా లీడర్లు పాలిటిక్స్ పక్కనబెట్టి లబ్ధిదారులకు బాసటగా నిలుస్తున్నారు. 

9,360 ఇండ్లు ప్రారంభం..

జిల్లాకు 19,306 ఇండ్లు మంజూరయ్యాయి. సొంత జాగలున్న 17,291 మంది అర్హులకు ఇండ్లు మంజూరు చేశారు.  గడిచిన నెల రోజుల్లో 9,360 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 4,647 గృహాలకు సంబంధించి బేస్మెంట్ పూర్తయ్యింది. 665 ఇండ్లు గోడల వరకు, 229 స్లాబ్ లెవెల్​కు చేరాయి.  వారందరికీ దశల వారీగా హౌసింగ్ ఇంజినీర్లు బిల్లులు చెల్లించారు. బేస్మెంట్ పూర్తైన వాటికి రూ.లక్ష, స్లాబ్ లెవల్​కు మరో రూ. లక్ష, స్లాబ్​ వేశాక రూ.2 లక్షలు, వాష్​రూమ్స్ తదితర పనులు ముగించాక రూ.లక్ష, మొత్తం రూ.5 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.  

మండల కమిటీతో పర్యవేక్షణ..

బేస్మెంట్ వరకు నిర్మించుకునే స్థోమతలేని వారికి మహిళా సంఘాల ద్వారా బ్యాంక్ లోన్లు ఇప్పించారు. ఇప్పటివరకు 2,637 మందికి బ్యాంకుల నుంచి రూ.30.07 కోట్ల రుణాలు ఇప్పించారు. 60 ఏండ్లు దాటిన మహిళలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేసి డీఆర్డీవో ఆధ్వర్యంలో లోన్లు ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.  ఇసుక కొరత రాకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను ఇందిరమ్మ ఇండ్లకు కేటాయిస్తున్నారు. రెంజల్​ మండలం కందకుర్తిలో 300 ట్రాక్టర్ల ఇసుక డంప్​ను ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించారు.

మేస్త్రీలకు పదుల సంఖ్యలో ఇండ్ల కాంట్రాక్ట్​ వస్తుండడంతో లబ్ధిదారులకు సహకరిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, లేబర్ ఆఫీసర్​తో కూడిన మండల లెవల్​ ధరల నియంత్రణ కమిటీ కంకర, స్టీల్, సిమెంట్ రేట్లను అజమాయిషీ చేస్తోంది. అన్నీ చేశాక కూడా ఇంటి నిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారుడి ఆమోదంతో క్యాన్సిల్ చేసి మరొకరికి మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు 56 ఇండ్లు రద్దు కాగా, వేరేవారికి కేటాయించారు.