ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా.. జిల్లావ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న పోలీసులు

 ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా..  జిల్లావ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న పోలీసులు

నిజామాబాద్, వెలుగు :  జిల్లా పోలీస్ యంత్రాంగం ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఫుట్​పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశానుసారం నిజామాబాద్​ పట్టణంతోపాటు జిల్లావ్యాప్తంగా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లోనూ ఫుట్​పాత్​ ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నారు. రద్దీగా ఉండే రోడ్లలోని ఫుట్​పాత్​ కబ్జాలను తొలగిస్తున్నారు. రోజురోజుకూ ట్రాఫిక్​ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడ ఫుట్​పాత్​లు ఆక్రమణలకు గురయ్యాయో మ్యాప్​ను రూపొందించి రంగంలోకి దిగారు. జిల్లావ్యాప్తంగా 4.7‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 లక్షల వాహనాలుండగా అందులో 3,90,126 టువీలర్స్​ఉన్నాయి. 

కార్లతో పాటు ఇతర ఫోర్ వీలర్స్​ 47,122, ఆటో రిక్షాలు 31 వేలు, 800 స్కూల్ బస్సులు, ఆర్టీసీలో అద్దె బస్సులు కలుపుకొని 398 బస్సులు ఉండగా, ప్రతి నెలా 2 నుంచి 3 వేల కొత్త వాహనాలు జిల్లాలోని రోడ్లపైకి వస్తున్నాయి. నిజామాబాద్​ నగర జనాభా 3.25 లక్షలు కాగా, ఆయా పనుల నిమిత్తం వచ్చిపోయే వారి సంఖ్య సుమారు 80 వేలు ఉంటుంది.  

బంగారం, వస్త్రాల కొనుగోలుకు జిల్లా ప్రజలతో పాటు మహారాష్ట్ర నాందేడ్ నుంచి జనాలు వస్తారు. సిటీని ఆనుకొని మాక్లూర్, మోపాల్, నవీపేట, డిచ్​పల్లి మండలాలు కూడా ఉన్నాయి. దీంతో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండడంతో నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరు ప్రధాన చౌరస్తాల్లో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినా మరో ఏడు కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉంది.

 ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోని వాహదారుల నుంచి ఈ ఏడాది జూలై 15 వరకు రూ.2.88 కోట్ల జరిమానా వసూలు చేశారు. యాక్సిడెంట్స్​లో 133 మంది మృతి చెందగా, 800 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వారిలో చాలామంది ఇప్పటికీ హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. రోడ్ల ఆక్రమణ తొలగిస్తే  ట్రాఫిక్​ సమస్య తీరడంతోపాటు యాక్సిడెంట్లను కంట్రోల్ చేయొచ్చని సీపీ నిర్ణయించారు. 

కొందరు గవర్నమెంట్​, ప్రైవేట్​ ఉద్యోగులు  టువీలర్స్​ తెచ్చి కంఠేశ్వర్​ బైపాస్ రోడ్​లోని రిలయన్స్ షాపింగ్​ మాల్​ బయట, కవిత కాంప్లెక్స్ ఆవరణలో పార్కింగ్​ చేస్తున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫెనాల్టీ విధించారు. పెయిడ్ పార్కింగ్​ ఖర్చు వద్దనుకొని వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలను ఇలా రద్దీ ప్రాంతాల్లో పెట్టడం ట్రాఫిక్ ఇబ్బందికి కారణమవుతోంది. 

తొలగించిన ఫుట్​పాత్​ ఆక్రమణలు..

బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్,  గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆర్ఆర్​చౌరస్తా, అర్సాపల్లి, రుక్మిణి చాంబర్స్ చౌరస్తా, మార్కెట్​ వెనుక ఉన్న కూరగాయల దుకాణాలను తొలగించారు.  మాటవినని వారికి ఫెనాల్టీలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఖలీల్​వాడీ, దేవీ రోడ్​, గంజీ రోడ్డు, ఖిల్లా రోడ్డు, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఫుట్​పాత్​ఆక్రమణలను తొలగించాల్సి ఉంది.   

రోడ్డు ఆక్రమణలు తీయాల్సిందే..

రోడ్లు, ఫుట్​పాత్​ను ఆక్రమించి చేసే వ్యాపారాలను అనుమతించం. ట్రాఫిక్​, రోడ్డు యాక్సిడెంట్స్ నియంత్రణ కోసం తొలగిస్తున్నాం. ఇప్పటి వరకు మంచి రిజల్ట్​సాధించాం. కబ్జాలు మొత్తం తీసివేసేదాకా ఆపరేషన్​ కొనసాగుతోంది. రోడ్డుకు పది ఫీట్ల దూరంలో వ్యాపారాలు చేస్తే అభ్యంతరం లేదు. - మస్తాన్​అలీ, ట్రాఫిక్​ ఏసీపీ