
- టన్ను ధర రూ.21 వేలు
- ఖమ్మంలోని అశ్వారావుపేటకు పంట తరలింపు
- సాగు పెంపుపై హార్టికల్చర్ ఫోకస్
- ఈ ఏడాది లక్ష్యం 3 వేల ఎకరాలు
- వచ్చే ఏడాది నిర్మల్‌లోనే ఫ్యాక్టరీ
నిజామాబాద్, వెలుగు : వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని జిల్లా రైతులను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహించింది. ఒక్కసారి సాగు చేస్తే ఐదేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుందని రైతులచైతన్యపర్చింది. సాగుకు ముందుకొచ్చిన రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందించడంతో జిల్లాలో 5,600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగైంది. ఇందులో 400 ఎకరాలు కోతకు రెడీగా ఉంది. ఎకరానికి 10 టన్నుల దిగుబడి అంచనా ఉండగా, టన్నుకు ధర రూ.21 వేలు లభిస్తుంది.
కొనుగోళ్లకు ఏర్పాట్లు..
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట అయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి పంటను తరలించేందుకు ప్రోగ్రాం హార్టికల్చర్ ఆఫీసర్లు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వారంలో కోతలు షురూ కానున్నాయి. నాలుగు మండలాలకు ఒక కొనుగోలు సెంటర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 9 సెంటర్లను అధికారులు సిద్ధం చేశారు. అంకాపూర్, నందిపేట, వెల్గటూర్, మోర్తాడ్, భీంగల్, ఇందల్వాయి, బోర్గాం(పి), వీరన్నగుట్ట, బోధన్ లో కలెక్షన్ పాయింట్లు రెడీగా ఉన్నాయి. ఆయిల్‌ఫెడ్ కంపెనీ యాజమాన్యం పాయింట్ల వద్ద కాంటా పెట్టనుంది.
ఈ ఏడాది 3 వేల ఎకరాల సాగు టార్గెట్
జిల్లాలో ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా జిల్లాయంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఎకరానికి 10 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల ఆదాయం వస్తుందని రైతులను చైతన్యపరుస్తుంది.
వచ్చే ఏడాది నిర్మల్‌లోనే ఫ్యాక్టరీ..
రెండు జిల్లాలకు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రీ యూనిక్ కంపెనీ రూ.వంద కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మల్‌లో నిర్మించబోతుంది.
ప్రభుత్వ ఖర్చు రూ.3 కోట్లు
జిల్లాలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేసేలా ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. రూ.193 మొక్కను కొనుగోలు చేసి, రైతులకు రూ.20 కే సరఫరా చేసింది. ఎకరం సాగు ఖర్చుకు ఏటా రూ.4,200 ఇచ్చింది. రూ.30 వేల విలువచే డ్రిప్ ఇరిగేషన్‌ను ఎస్సీ, ఎస్టీ లకు వంద శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం, 12 ఎకరాల్లోపు ఉన్న రైతులందరికీ 80 శాతం సబ్సిడీతో అందించింది.
రైతులు ముందుకు రావాలి
ఆయిల్ పామ్ సాగుకు జిల్లా రైతులు ముందుకు రావాలి. సాగుకు ఖర్చుతోపాటు సబ్సిడీపై పరికాలను ప్రభుత్వం అందిస్తుంది. అధిక దిగుబడి వచ్చే పంటతో లాభాలు గడించవచ్చు. వచ్చే ఏడాది నిర్మల్ జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుంది.
-శ్రీనివాస్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్