- రేపు పంపిణీని ప్రారంభించనున్న ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డి
- చీర అందుకున్న ప్రతి మహిళ ఫొటో అప్ లోడ్
- పర్యవేక్షించేందుకు సెగ్మెంట్‌కు ఒక స్పెషల్ ఆఫీసర్
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్సు కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంతోపాటు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు 2 లక్షల చీరలు చేరగా, 806 గ్రామ సంఘాల ద్వారా చీరల సరఫరాకు పంపిణీకి జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మండల కేంద్రాలు, గ్రామాల్లో చీరల పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయి. పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చీర అందుకున్న ప్రతి మహిళ ఫొటోను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతి సెగ్మెంట్‌కు ఒక స్పెషల్ అధికారిని సైతం నియమించారు.
అందరికీ ఒకే రంగు చీరలు..
జిల్లాలో మొత్తం 32,796 మహిళా సంఘాలు, 3,42,755 మంది సభ్యులు ఉన్నారు. తొలి విడతగా 2 లక్షల చీరలు జిల్లా కేంద్రానికి చేరాయి. వీటిలో తొమ్మిది గజాల చీరలు 54 వేలు, మిగతావి ఆరు గజాల చీరలు ఉన్నాయి. మహిళల్లో సమానత్వం ప్రతిబింబించేలా ఒకే రంగు చీరలు పంపిణీ చేస్తుండడం విశేషం. చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకతకు ప్రయారిటీ
ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రభుత్వం పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి గ్రామంలో వీవోఏల పర్యవేక్షణలో చీరల పంపిణీకి జరగనుంది. బోగస్‌కు తావులేకుండా చీర తీసుకున్న మహిళ ఫొటోను డీఆర్డీవో కార్యాలయానికి అప్‌లోడ్ చేయనున్నారు. అక్కడి నుంచి అన్ని వివరాలు స్టేట్ సర్వ్ కార్యాలయానికి వెళ్తాయి. ప్రతి మహిళతో పాటు 18 ఏండ్లకు పైబడిన యువతులకూ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 9 నాటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు జిల్లాయంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.
ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లు
ఇందిరమ్మ చీరల పంపిణీని పర్యవేక్షించేందుకు సెగ్మెంట్‌కు ఒకరు చొప్పున జిల్లాలో ఐదుగురు స్పెషల్ అధికారులను నియమించారు. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ మండలాలకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సెగ్మెంట్‌కు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ సెగ్మెంట్‌కు సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, బాల్కొండ సెగ్మెంట్‌కు డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌కు ఆర్డీవో రాజేంద్రకుమార్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. రూరల్ ప్రాంతాల్లో పూర్తి చేసిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో దశలవారీగా చీరలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహిళల సంక్షేమమే ధ్యేయంగా..
మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తోంది. ఆడబిడ్డల శ్రేయస్సు కోసం ఫ్రీబస్ సౌకర్యం కల్పించింది. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మీ-సేవ కేంద్రాల బలోపేతం, బస్సుల కొనుగోలుకు లోన్లు, సోలార్ కేంద్రాల ఏర్పాటు, వడ్ల కొనుగోలు సెంటర్ల అప్పగింత, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సభ్యులకు రూ.70 కోట్లు బ్యాంకు లోన్ల వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని మహిళల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తోంది.
ఒక్కరినీ మిస్ కానియ్యం
ప్రతి ఒక్కరికీ చీర అందేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కరిని కూడా మిస్ కాకుండా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి మహిళా సంఘం సభ్యురాలితో పాటు 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికీ ఇందిరమ్మ చీర అందనుంది. ప్రతి గ్రామంలో పంపిణీ జాబితా, ఫొటోలు అప్‌లోడ్‌ను పరిశీలిస్తాం. - సాయాగౌడ్, డీఆర్డీవో
