నిజామాబాద్ లోమైనర్‌‌కు పుట్టిన శిశువు అమ్మకం..ఆరుగురిపై కేసు నమోదు

నిజామాబాద్ లోమైనర్‌‌కు పుట్టిన శిశువు అమ్మకం..ఆరుగురిపై కేసు నమోదు
  • డబ్బులు ఇవ్వడంలో తేడా రావడంతో బయటకు పొక్కిన విషయం 
  •  నలుగురు అరెస్ట్‌‌

నిజామాబాద్, వెలుగు : మైనర్‌‌కు పుట్టిన మగ శిశువును గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. నలుగురిని నిజామాబాద్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. వన్‌‌టౌన్‌‌ పీఎస్‌‌లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను ఎస్‌‌హెచ్‌‌వో రఘుపతి శుక్రవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని చంద్రశేఖర్‌‌ నగర్‌‌ కాలనీలో ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తి కారణంగా బాలిక గర్భం దాల్చింది. 

విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు డెలివరీ కోసం జూన్‌‌ నెలాఖరులో నగరంలోని జీజీహెచ్‌‌లో చేర్పించారు. అదే నెల 30న బాలికకు మగబిడ్డ పుట్టాడు. తర్వాత బాలిక ఇంటి పక్కన ఉండే, ఆమెకు బావ వరసయ్యే వ్యక్తి ద్వారా పసికందును అమ్మేందుకు అతడి ఫ్రెండ్స్‌‌ నదీమ్, తలహబ్‌‌ హుస్సేన్‌‌ ప్లాన్‌‌ చేసి బాలికను సైతం ఒప్పించారు. పులాంగ్‌‌ ఏరియాకు చెందిన మస్రత్‌‌ పర్వీన్‌‌ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఆమె అక్క రఫత్‌‌ పర్వీన్‌‌ శిశువును కొనేందుకు సిద్ధమైంది. 

ఇందులో భాగంగా రూ. 2 లక్షలకు అగ్రిమెంట్‌‌ చేసుకొని, ముందుగా రూ. లక్ష ఇచ్చి జులై 2న శిశువును తీసుకెళ్లి మస్రత్‌‌ పర్వీన్‌‌కు ఇచ్చింది. అగ్రిమెంట్‌‌ ప్రకారం మిగిలిన రూ.లక్ష గురువారం ఇవ్వాల్సి ఉండగా.. స్పందించకపోవడంతో నదీమ్, తలహబ్‌‌ హుస్సేన్‌‌ రఫత్‌‌ పర్వీన్‌‌ నిలదీయడంతో గొడవ జరిగింది. దీంతో శిశువు అమ్మకం, కొనుగోలు విషయం పోలీసులకు తెలిసింది. 

మస్రత్‌‌ పర్వీన్‌‌ నుంచి శిశువును స్వాధీనం చేసుకొని నిజామాబాద్‌‌లోని చైల్డ్‌‌ కేర్‌‌ సెంటర్‌‌కు తరలించారు. శిశువును అమ్మిన బాలిక తల్లి, ఆమె బావ, కొనుగోలు చేసిన మస్తర్‌‌, రఫత్‌‌ ఫర్వీన్‌‌తో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన నదీమ్, తలహబ్‌‌ హుస్సేన్‌‌పై కేసు నమోదు చేశారు. ఇందులో బాలిక, రఫత్‌‌ పర్వీన్‌‌ తప్ప మిగతా నలుగురిని అరెస్ట్‌‌చేసినట్లు 
ఎస్‌‌హెచ్‌‌వో తెలిపారు.