ఎన్ని సీట్లు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తం: అర్వింద్

ఎన్ని సీట్లు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తం: అర్వింద్
  • రాజకీయం ఎలా చేయాలో  మాకు తెలుసు: అర్వింద్
  • ఎక్కడి నుంచి అయినా పోటీకి రెడీ అని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం ఎలా చేయాలో తమకు బాగా తెలుసన్నారు.పార్టీలోని సీనియర్లందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. సోమవారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. ‘‘కామారెడ్డితో పాటు ఆర్మూర్, కోరుట్ల ఎక్కడి నుంచి పార్టీ హైకమాండ్ పోటీ చేయమంటే.. అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు నేను రెడీగా ఉన్న. కోరుట్లలో నాపై పోటీ చేస్తానని కవిత బహిరంగంగా ప్రకటించారు.

 ఆ మాటకు కవిత కట్టుబడి పోటీ చేయాలి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడి నుంచైనా.. కవితపై పోటీకి నేను సిద్ధంగా ఉన్నా..”అని అర్వింద్ అన్నారు. తనపై పోటీ చేసేందుకు కవిత భయపడుతున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఫాంలు కేసీఆర్ ఇస్తారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిచ్చి గెలిపించుకుని.. తర్వాత బీఆర్ఎస్​లో చేర్చుకునే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్​తో కొట్లాడేది బీజేపీ మాత్రమే అని, అందుకే కేసీఆర్​ను మోదీ ఎన్డీఏలో చేర్చుకోలేదన్నారు. 

కేటీఆర్​ను మోదీ సీఎం కానివ్వలేదని, భవిష్యత్తులో కూడా కానివ్వరని అన్నారు. కేసీఆర్​తో కలిసే ప్రసక్తే లేదని స్వయంగా మోదీయే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కల్వకుంట్ల కుటుంబం దోపిడీ ప్రభుత్వమని, కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.